జాత్యహంకారాన్ని ప్రశ్నించిన ఆస్కార్‌ చిత్రం

Oscar-winning film questions racismవివక్షను అర్ధం చేసుకోవాలంటే దాన్ని అనుభవించాలి. కేవలం ఆ బాధను మానవతా కోణంతో అర్ధం చేసుకుంటే వివక్షమానవ హదయాలను ఎంత లోతుగా గాయం చేస్తుందో, ఎందరి ఆలోచనలను జీవితాంతం ప్రభావితం చేస్తుందో అర్ధం అవడం కష్టం. వివక్షను అనుక్షణం అనుభవించే వారి అనుభవాల నుండి బైటికి వచ్చే ఆలోచనలకు చాలా పదును ఉంటుంది. ఈ పాయింట్‌ మీద 1947లో వచ్చిన మంచి చిత్రం ‘జెంటిల్మాన్స్‌ అగ్రీమెంట్‌’. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యూదులపై జరిగిన అన్యాయాలు ఒకొక్కటిగా బైటికి వచ్చాయి. అయితే కమ్యునిజాన్ని సమర్ధించే భావజాలం ఉన్నవారు యూదులపై జరిగిన అన్యాయాలను ఇతివత్తంగా తీసుకుని హాలివుడ్‌లో కొన్ని సినిమాలు తీశారు. యూదులను సమర్ధించే సినిమాలన్నీ కమ్యునిజాన్ని ప్రోత్సహించేవిగానే ఉండేవి. అలాంటి సమయంలో కమ్యునిజాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా ఆంటీ-సెమిటిజం (యూదు వ్యతిరేకత) పై వచ్చిన చిత్రం ‘జెంటిల్మాన్స్‌ అగ్రిమెంట్‌’. ఎనిమిది కేటగిరీలలో ఆస్కార్‌ నామినేషన్లను పొందిన ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు మరో రెండు ఆస్కార్‌ అవార్డులు లభించాయి.
జెంటిల్మాన్స్‌ అగ్రిమెంట్‌ అంటే పెద్దమనుషుల ఒప్పందం . రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య జరిగే అనధికారిక ఒప్పందం అది. ఇది సాధారణంగా మౌఖికంగా చేసుకునే ఒప్పందం. నైతిక బాధ్యతతో కూడుకున్న దీని వెనుక చట్టపరమైన బాధ్యత ఉండదు. అయితే ఈ సినిమాకు ఈ పేరు పెట్టడం ఎంత సమంజసమో తెల్సుకోవడానికి ఈ కథను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.
ఫిలిఫ్‌ స్కైలర్‌ గ్రీన్‌ ఒక జర్నలిస్టు. ఇతని భార్య మరణించింది. తన చిన్న కొడుకుతోనూ తల్లితోనూ ఇతను నగరంలో ఉంటున్నాడు. ఒక ప్రఖ్యాత న్యూస్‌ పేపర్‌ ఎడిటర్‌ న్యూయార్క్‌ నగరంలో ఫిలిప్‌కు ఉద్యోగం ఇస్తాడు. గుండె జబ్బున్న తల్లితోనూ కొడుకు టామీతోనూ ఆ నగరానికి వస్తాడు ఫిలిప్‌. ఎడిటర్‌ ఇచ్చిన పార్టీలో అతనికి కేథీ పరిచయం అవుతుంది. ఈమె విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఈమె ఆ ఎడిటర్‌ మిత్రునికి ఇచ్చిన సలహా నచ్చి ఆయన పిలిప్‌ కు ఓ బాధ్యత అప్పగిస్తాడు. ఫిలిప్‌ మంచి పాత్రికేయుడని, లోతుగా అధ్యయనం చేసి రాస్తాడని నమ్మి ఆయన యూదు వ్యతిరేకతపై పుస్తకం రాయమని ఫిలిప్‌ని కోరతాడు. ఎంతో ఆలోచించి ఫిలిప్‌ దానికి ఒప్పుకుంటాడు.
ఫిలిప్‌, కాథి ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. తాను ఆ వ్యాసం రాయాలంటే యూదుల బాధను అనుభవించాలని భావిస్తాడు ఫిలిప్‌. అందుకే తాను యూదుడినని చెప్పి పనిలో చేరతాడు. ఆ ఆఫీసులోనే అతను యూదుడని నమ్మి అతనితో వ్యవహరించే వారిలో తేడాను గమనిస్తాడు. ఎవరూ బైటికి చెప్పకపోయినా ప్రతి చిన్న విషయంలో విడిగా చూడడం అతనికి అనుభవానికి వస్తుంది. ఫిలిప్‌ సెక్రటరి యూదు జాతికి చెందిన స్త్రీ. కానీ వివక్ష తట్టుకోలేక పేరు మార్చుకుని తాను యూదురాలినని ఎవరికీ తెలియకుండా అక్కడే పని చేసుకుంటూ ఉంటుంది. ఫిలిప్‌ని కూడా అలాగే ఉండమని సలహా ఇస్తుంది. ఆమె ద్వారా ఆ ఆఫీసులో చాటున సాగే వివక్ష గురించి తెలుసుకుంటాడు ఫిలిప్‌. ఆఫీసులో మార్పులు తీసుకొస్తాడు. ఫిలిప్‌కి ఈ పని అప్పగించిన ఎడిటర్‌ తన ఆఫీసులో కూడా అదే వివక్ష నడుస్తుందని తెలుసుకోలేకపోతాడు. జాత్యహంకారం ఎంత చాటుగా సాగుతుందో ఫిలిప్‌ గమనిస్తాడు. అక్కడే పని చేసే ఆనీ ఫిలిప్‌కు మంచి స్నేహితురాలవుతుంది.
ఫిలిప్‌ స్నేహితుడు డేవ్‌ యూదుడు. రెండవ ప్రపంచ యుద్దంలో పాల్గొంటాడు. ఉద్యోగం వేటలో ఇతను న్యూయార్క్‌ వస్తాడు. బాల్య స్నేహితుడిని ఆత్మీయంగా స్వాగతిస్తాడు ఫిలిప్‌. డేవ్‌కు యూదుడయిన కారణంగా నగరంలో అద్దెకు ఇల్లు దొరకదు. అతనితో ఎవరూ స్నేహం చేయరు. ప్రతిచోట ఈ వివక్షను అనుభవిస్తాడు ఫిలిప్‌. డేవ్‌ మౌనంగా దాన్ని ఎదుర్కోవడాన్ని కూడా గమనిస్తాడు. కాని డేవ్‌ అంత సహనంగా ఫిలిప్‌ ఉండలేకపోతాడు. అతని తల్లి అనారోగ్యం పాలయితే ఇంటికి వచ్చిన డాక్టర్‌ యూదు స్పెషలిస్ట్‌ దగ్గరకు వెళ్ళవద్దని ఫిలిప్‌ని ఆపుతాడు. తాను కూడా యూదుడినని చెబితే ఆయన మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంటి పోస్ట్‌బాక్స్‌పై ఫిలిప్‌ తన మారు పేరు పెట్టబోతే ఓనర్‌ ఒప్పుకోడు. యూదుడు ఆ భవనంలో ఉన్నట్లు ఇతరులకు తెలియకూడదని గోల చేస్తాడు. కేథీతో హోటల్‌లో గడపాలనుకుంటే ఫిలిప్‌ యూదుడని తెలిసి అక్కడి మేనేజర్‌ రూం లేదంటాడు.
ఎవరూ ప్రత్యేకంగా జాతి పేరు ప్రస్తావించరు. దాని కారణంగా ఫిలిప్‌ని దూరం పెడుతున్నామని చెప్పరు. కాని ఫిలిప్‌ యూదుడని చెప్పిన వెంటనే అతనితో వాళ్లు ప్రవర్తించే విధానంలో మార్పు వస్తుంది. దీన్ని మొదటిసారి అనుభవించిన ఫిలిప్‌లో అసహనం పెరుగుతుంది. మనుషులని ఇలా వేరు చేసి చూడడం అన్యాయం అని కేథీతో అంటాడు.
మరోపక్క ఫిలిప్‌ కొడుకు టామీని స్కూల్‌లో పిల్లలు అవమానిస్తూ ఉంటారు. గాయపడిన మనసుతో టామీ ఇల్లు చేరి తనకు జరిగిన అవమానం గురించి తండ్రికి చెబితే అక్కడే ఉన్న కాథి టామిని బాధపడవద్దని నిజానికి అతను యూదుడు కాదని, ఫిలిప్‌ కేవలం తన పని కోసం అలా నటిస్తున్నాడని చెప్పి సముదాయించ బోతుంది. ఇది ఫిలిప్‌కి నచ్చదు. వివక్షపై పోరుకు ఇలాంటి మాటలు ఆటంకం అని టామీ యుదుడు కాదు కాబట్టి ఆ అవమానాన్ని మర్చిపొమ్మని సలహా ఇవ్వడం తప్పని కేథీతో వాదిస్తాడు.
కేథీ ఫిలిప్‌ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కేథీ ఫిలిప్‌ని తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తుంది. అక్కడ ఫిలిప్‌ నిజంగా యూదుడు కాదని ఆమె వారికి చెప్పాలనుకుంటుంది కాని ఫిలిప్‌ దానికి ఒప్పుకోడు. ఫిలిప్‌ యూదుడని తెలిసి చాలామంది స్నేహితులు ముందే అక్కడి నుంచి వెళ్లిపోతారు. కేథీ అక్క జేన్‌ ఉండే ఊరిలో యూదులపై వివక్ష ఎక్కువగా ఉంటుంది. అక్కడే కేథీకి కూడా ఓ సొంత ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని డేవ్‌కి అద్దెకిమ్మని అడుగుతాడు ఫిలిప్‌. కాని అక్కడ పక్కింటివారు దానికి ఒప్పుకోరంటుంది కేథి. ఇది ఫిలిప్‌కు కోపం తెప్పిస్తుంది. ఆమెలో నిజంగా యూదుల పట్ల సహానుభూతి ఉంటే ఆమె ఈ వివక్షను ఎదిరించాలి కాని ఇలా రెండు ముఖాలుగా ఉండకూడదంటాడు ఫిలిప్‌. ఈ వాదన వల్ల ఇద్దరూ దూరం అవుతారు.
ఆనీ కూడా ఫిలిప్‌ని ప్రేమిస్తుంది. కాని ఫిలిప్‌ వివక్షపై చేస్తున్న పోరు సరికాదని, ఇలాంటి నాటకంతో ఫలితం పెద్దగా ఉండదని అంటుంది. ఫిలిప్‌ ఒక యూదుడిగా అనుభవించి రాసిన పుస్తకం ఆఫీసులో సంచలనం సష్టిస్తుంది. కేథీ డేవ్‌ని కలిసి ఒక పార్టీలో యూదులపై పైఅధికారి చేసిన వ్యంగ్యోక్తులు తనను గాయపరిచాయని చెప్తుంది. డేవ్‌ అంతా విని మరి దానికి ఆమేం చేసిందని ప్రశ్నిస్తాడు. వివక్ష గురించి బాధపడేవారు ప్రతి సందర్భంలో దానిపై పోరాడాలి తప్ప మౌనంగా చాలా విషయాలను భరిస్తూ పోతే వివక్షను పెంచి పోషించినవారవుతారని ఆమెకు చెప్తాడు. కేథీ తనెక్కడ తప్పు చేసిందో తెలుసుకుంటుంది. ఆమె తన ఇల్లు డేకు అద్దెకు ఇచ్చి, అతనికి ఆ ఊరి వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి అతని పక్కింట్లోకి మారుతుంది. ఇది తెలిసి ఫిలిప్‌ ఆమెను మళ్ళీ కలుస్తాడు. ఫిలిప్‌ రాసిన పుస్తకం చదివి ఇప్పుడు తనకు భవిష్యత్తుపై ఆశ కలిగిందని, మంచి రోజులు వస్తాయనే నమ్మకం ఏర్పడిందని ఫిలిప్‌ తల్లి అతనితో అంటుండగా సినిమా ముగుస్తుంది.
ఈ కథకు మూలం ఇదే పేరుతో 1947లో లారా జెడ్‌ హాబ్సన్‌ రాసిన నవల. ఈ సినిమాను నిర్మించిన డారెల్‌ ఎఫ్‌. జానుక్‌ని యూదుడనుకుని లాస్‌ ఏంజల్స్‌ కంట్రీక్లబ్‌లో సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించారట. అయన యూదుడు కాకపోయినా ఈ విషయం ఆయన్ని చాలా బాధించింది. అప్పుడే ఈ నవలను సినిమాగా తీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఆయన్ని ఈ సినిమా తీయవద్దని చాలామంది శ్రేయోభిలాషులు హెచ్చరించారు. కానీ ఆయన దేనికీ భయపడక ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయగలిగారు. ఎలియా కాజన్‌ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగానూ, ఉతమ దర్శకత్వ విభాగంలోనూ ఆస్కార్లు లభించాయి. ఫిలిప్‌ స్నేహితురాలు ఆనీ పాత్రలో నటించిన నటి సెలెస్టే హోల్మ్‌కు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ లభించింది. ఈ సినిమాలో డేవ్‌ పాత్ర పోషించిన జాన్‌ గార్ఫీల్డ్‌ ఒక్కడే నిజంగా యూదుడు.
జెంటిల్‌మ్యాన్స్‌ అగ్రిమెంట్‌ను నిర్మించినందుకు, బ్నై బ్రిత్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ డారిల్‌ జానక్‌ను 1948 కి గాను ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా సత్కరించింది. ఆ సమయంలో డిజానక్‌కు నివాళులర్పిస్తూ, న్యూ మెక్సికో సెనేటర్‌ క్లింటన్‌ ఆండర్సన్‌ ఇలా అన్నారు, ”అతను ఈ సినిమాతో వీధుల్లో అరుస్తూ తిరగలేదు, పౌరులకు నీతి వాక్యాలు చెప్పలేదు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. అతను మిమ్మల్ని థియేటర్‌లో హాయిగా కూర్చోబెట్టి, సమస్యను విశ్లేషించే దిశగా కావల్సిన ఆలోచనలను మీ మెదళ్ళకు అందించాడు. ‘ఈ పరిస్థితిని మార్చాలి’ అని మీకై మీరు నిర్ణయంచుకునే విధంగా దాన్ని చిత్రించాడు”. అదీ ఈ సినిమా గొప్పతనం. అందుకే ఈ సినిమా ఆర్ధికంగానూ విజయం సాధించింది.
ఇందులో ఫిలిప్‌ పాత్రలో నటించిన గ్రెగరీ పెక్‌ దీన్ని తాను పూర్తిగా మనసు పెట్టి నటించలేదని, అప్పట్లో అపరిపక్వతతో ప్రవర్తించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమైనా అయన ఎలియా కాజన్‌ దర్శకత్వంలో మళ్ళీ నటించలేదు. కాజన్‌ సామజిక సమస్యలను చర్చిస్తూ గొప్ప సినిమాలు తీసిన దర్శకుడిగా ఈ సినిమాతో మొదలుపెట్టి తరువాత మంచి పేరు తెచ్చుకున్నారు.
ఫిలిప్‌ స్నేహితురాలు అన్నే డెట్రీ పాత్ర ఈ సినిమాలో వివక్ష పై పోరు దిశగా ప్రజల కర్తవ్యం గురించి జరిపిన చర్చ వివక్ష గురించి సరైన ఆలోచన చేయడానికి తోడ్పడుతుంది. అందుకే తక్కువ నిడివి ఉన్న ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ పాత్ర పోషించిన సెలెస్టీ హోల్మ్‌కు ఆస్కార్‌ అందించింది. ఒక సందర్భంలో అప్పటి మిసిసిప్పి గవర్నర్‌ బిల్బోను ప్రస్తావిస్తూ అన్నే ఇచ్చే వివరణ గొప్ప ఆలోచనను కలిగిస్తుంది. డెమొక్రాట్‌ అయిన థియోడర్‌ జి. బిల్బో, 1935 నుండి 1947 వరకు యుఎస్‌ సెనేట్‌లో పనిచేయడానికి ముందు రెండుసార్లు మిస్సిస్సిప్పి గవర్నర్‌గా ఉన్నారు. ఆ సమయంలో ‘ప్రజా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత పట్ల చాలామంది శ్వేతజాతీయులలో పెరుగుతున్న అసహనం’ అతని పతనానికి దారితీసిందని జర్నల్‌ ఆఫ్‌ మిస్సిస్సిప్పి హిస్టరీలోని ఒక కథనం పేర్కొంది. ఇతను నల్ల జాతీయులని విపరీతంగా ద్వేషించేవాడు. 1947లో ఆయన రాసిన ”సెపరేషన్‌ ఆర్‌ మోంగ్రెలైజేషన్‌: టేక్‌ యువర్‌ ఛాయిస్‌” అనే పుస్తకంలో ఈ వివరణ ఉంది.
ఆయన్ని ఈ సినిమాలో ఉదహరిస్తూ ఓ సందర్భంలో అన్నే డెట్రీ ఇలా అంటుంది ”వాళ్ళు బిల్బోను తిట్టి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం మంచి పోరాటం చేశామని అనుకుంటారు. మాటల నుండి చర్యలకు మారడానికి వారికి ధైర్యం లేదు. ఏదో ఓ చిన్న చర్య జరగాలి కదా. అది సమస్యకు పూర్తి సమాధానం కాదని నాకు తెలుసు. కానీ ఎక్కడో ప్రారంభం జరగాలి, అదీ పూర్తి నిబద్దతతో. కరపత్రాలు మార్పును తీసుకురావు. అది ప్రజలతో రావాలి. ధనవంతులు, పేదలు, పెద్దలు చిన్నవారు అందరిలో ఒకేసారి ఈ మార్పు రావాలి”
జాత్యహంకారాన్ని వివక్షను ప్రోత్సహించే వారిని తిట్టి మనం గొప్ప లిబరల్‌ వ్యక్తులమని చెప్పుకునే వారిని మాటలతో కాదు చేతలతో పోరాటం జరగాలని, చిన్న చిన్న ప్రతిఘటనలతో మొదలుపెట్టి సామ్యవాదానికి ఆటంకం కల్పించే శక్తులకు ప్రతిచోట అడ్డు తగులుతూ వెళ్ళకపోతే ఏ వివక్ష కూడా అంతం అవదనే సందేశాన్ని అందించిన ఈ సినిమా ఇప్పటికీ వివక్ష ఎదుర్కుంటున్న సమాజాలలో ఆలోచనలను రేకెత్తించగల చిత్రం. ఆ పరిస్థితులలో ఎంతో ధైర్యంతో తీసిన సినిమా ‘జెంటిల్మెన్స్‌ అగ్రీమెంట్‌’.
– పి.జ్యోతి,
98853 84740

Spread the love