
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
బిఏఎస్ పథకం క్రింద దళిత, గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని ప్రధాన పాఠశాలలో కూడా అవకాశం కల్పించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్క్రీం కింద ప్రతి సంవత్సరం దళిత, గిరిజన విద్యార్థులకు ఒకటి, ఐదవ తరగతిలో ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వం ఫీజులు కట్టి ఉన్నత చదువులు చదివిస్తున్నదని తెలిపారు. నల్లగొండ పట్టణంలో ఉన్న ముఖ్యమైన పాఠశాలలు దళిత, గిరిజన విద్యార్థులను నిరాకరిస్తున్నాయని ఆవేదన చెందారు. గత సంవత్సరము లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థులను చేర్చుకొని ఈ సంవత్సరం విద్యార్థులను నిరాకరిస్తూ ఎస్సీ వెల్ఫేర్ అధికారికి లేక రాసినట్లు పేర్కొన్నారు.ఇది అత్యంత దారుణమైన, అన్యాయమైన విషయం అన్నారు. ప్రభుత్వ వసతులు ప్రభుత్వ రాయితీలు పొందుతున్న పాఠశాలలు నిరుపేద విద్యార్థులకు చదువులు చెప్పడానికి నిరాకరించడాన్ని కలెక్టర్ పరిశీలించాలన్నారు.విద్యాహక్కు చట్టం ప్రకారంగా 25 శాతం దళిత, గిరిజన, బీసీ విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించి చదువు అందించాల్సి ఉందన్నారు. అయినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంతో నిరాకరిస్తున్నదని ఆరోపించారు. నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫన్సెస్, లిటిల్ ఫ్లవర్, ఎంవిఆర్, ఎస్పిఆర్, మౌంట్ లిటర, ఏకలవ్య, లాంటి స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ పథకం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.