రేపు పాలస్తీనా విముక్తవుతుంది

Palestine will be liberated tomorrowప్రతి రోజూ మనం చెప్పుకొనే
ఈరోజు చివరిదవాలి
మనమంతా స్వేచ్ఛగా ఇంటికెళ్తాం
చివరాఖరికి, రేపిదంతా ముగిసిపోతుంది
రేపు పాలస్తీనా విముక్తవుతుంది
రేపు పాలస్తీనా విముక్తవుతుంది

నా కన్నీళ్లను తుడిచేందుకు
అమ్మా నాన్నేవరూ బ్రతికిలేరు
అందుకు నేను ఏడువబోను
యుద్ధ బీభత్సానికి నే భయపడుతున్నాను
కానీ ఆ భయాలకు ఏమాత్రం తలొగ్గను
మరింత ధైర్యంగా తలెత్తి నిలబడతాను
నా హృదయాంతరాళంను అడిగి చూశాను
సందేహమే లేదు
రేపు పాలస్తీనా విముక్తవుతుంది
రేపు పాలస్తీనా విముక్తవుతుంది

నిప్పులు కక్కుతూ మంటలు మండుతూ
నింగిన ఎగిసే రాకెట్లను
బాంబులను చూశాను
సూర్యకాంతికి మెరిసే
వర్షపు చుక్కల్లా వున్నాయవి
నా ఆప్తులందరిని దూరం చేశాయి
నా కలలన్నిటినీ లిప్తపాటులో
నాశనం చేశాయి

ఇంతకీ మనుషులుగా
మా హక్కులకేమైంది?
మా జీవితాలకేమైనా విలువుందా?
లేకా ఇంకా ఇవన్నీ ఒట్టి అబద్దాలేనా?
నేను చిన్నపిల్లనేనని నాకు తెలుసు
మరి హింసని రాసిన
నీకు మనస్సాక్షి బ్రతికే వుందా?

ప్రతి ఇసుక రేణువునూ
ప్రతి రాయినీ ప్రతి చెట్టునూ
ఆర్ద్రంగా నా ఒట్టి చేతులతో నిమురుతున్నాను
అంతే ఆర్ద్రతగా
అవి నాతో బదులిస్తున్నాయి
వారేమి చేయలేరని
ఈ మట్టిలో ఎప్పుడో విముక్తయిన
నీ ఊపిరినెప్పటికీ గాయపరచలేరని

రేపు పాలస్తీనా విముక్తవుతుంది
రేపు పాలస్తీనా విముక్తవుతుంది

రేపు పాలస్తీనా ఊపిరి పోసుకుంటుంది
రేపు పాలస్తీనా విముక్తి గీతాన్ని
ఆలపిస్తుంటుంది

మూలం :
Hamza Namira / Maher Elzein sd¾q Palestine, tomorrow will be free పాట నుండి
అనువాదం : అమృతరాజ్‌

 

Spread the love