నీట్‌ను మళ్లీ నిర్వహించాలని 27న పార్లమెంటు ముట్టడి

– యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీట్‌ రాతపరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 27న ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ నీట్‌ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నదని అన్నారు. తెలంగాణ నుంచి ఈనెల 27న జరిగే పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి భారీగా విద్యార్థులను తరలిస్తామని చెప్పారు. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేసి విద్యావ్యవస్థను నాశనం చేసిన బీజేపీని గద్దెదించాలని అన్నారు. దేశంలో నీట్‌ రాసిన 24 లక్షల మంది విద్యార్థులు కేంద్రంపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్టీఏను రద్దు చేయాలి : సురభి ద్వివేది
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జీ సురభి ద్వివేది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. న్యాయం చేయాలంటూ విద్యార్థులు కోరుతుంటే పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నారని అన్నారు. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రధాని మోడీకి డిగ్రీ లేనందునే విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యార్థులంతా ఢిల్లీ చేరుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.

Spread the love