Tuesday, March 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'పెంబి' ఆదివాసీల పోరుబాట

‘పెంబి’ ఆదివాసీల పోరుబాట

- Advertisement -

తెలంగాణ మ్యాప్‌లో ప్రస్తుత నిర్మల్‌ జిల్లాలోని ‘పెంబి” ఒక చిన్న మండలం కావచ్చు, కానీ అక్కడ నివసించే గిరిజనుల పోరాట చరిత్ర హిమాలయమంత సాంద్రత కలిగినదిగానే చూడక తప్పదు. నిర్లక్ష్యానికి గురైన ఒక జాతి, తమ ఆత్మగౌరవం కోసం పాలకుల కోటల పునాదులను కదిలించే ఒక ”ప్రజా ఉద్యమం” సాగించిన చారిత్రక ఆనవాళ్లతో ఇప్పుడు సమస్యలపై నినదిస్తున్నది. నాడు కొమురంభీమ్‌ సాగించిన జల్‌-జంగిల్‌-జమీన్‌ పోరాటం నేటికీ పెంబి అడవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉందనట్లుగా ప్రస్తుత పరిస్థితి తెలుపుతున్నది. ఈ మండలంలో 24 గ్రామ పంచాయతీలుండగా మూడు గ్రామపంచాయతీల పరిధిలోని పదహారు ఆవాస గ్రామాల పరిస్థితి అగమ్యగోచరమే. ఈ పదహారు ఆదివాసీ ఆవాస గ్రామాలు (గోండు కోలం నాయక పోడు) వర్షకాలంలో ఎక్కడికక్కడ స్తంభించిపోవడం తప్ప మరోమార్గం లేని పరిస్థితి. దొందారి గ్రామపంచాయతీ పరిధిలోని చాకిరేవు గూడెంలో సుమారు 30 కుటుంబాలుండగా ఒకటే బోరింగ్‌, ఈ లెక్కన కనీసం సరిపడా తాగునీటి వసతి కూడా లేదు.

పక్కనే ఉన్న వాగులోనే అన్ని రకాల నీటి సౌకర్యం తీర్చుకోవాల్సిందే. కరెంట్‌ కానరాదు, సెల్‌సిగ్న‌ల్‌ కూడా ఉండదు. ఆ మండలంలో ఆదివాసీ ఆవాసాలకు, గూడెలకు వంతెనల నిర్మాణం లేకపోవడం, కేవలం రవాణా సమస్యనే కాదు, అక్కడ ఒక తరం విద్యకు, మెరుగైన వైద్యానికి దూరం చేయడం. ప్రభుత్వ ఆస్పత్రిలో రెగ్యులర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ లేకపోవడం, అంగన్‌వాడీ పోస్టులు కూడా భర్తీ కాకుండా ఖాళీగా ఉండటం అంటే పెంబి మండలంలో పుట్టబోయే తరాన్ని పౌష్టికాహార లోపానికి, మరణానికి దగ్గర చేయడమే! పసుపుల- మందపెళ్లి – రాజురా వంతెనలు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్నాయి. అది ప్రభుత్వ నిర్లక్ష్యలోపం. అభివృద్ధి నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నా, పెంబి గడ్డపై ఆదివాసీల జీవితాలు మాత్రం ఇంకా వాగుల మధ్య, అడవి కంచెల మధ్య బందీ అయి ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితిలో తాజాగా సీపీఐ(ఎం) నేతృత్వంలో (మార్చి 21, 2026న) యాపలగూడ నుంచి పెంబి గిరిజనుల పాదయాత్ర మొదలైంది.ఇది ఒక రకంగా పెంబి గిరిజన గుండె రగిలించిన నిప్పుకణికగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దోత్తివాగు, కడం వాగులు నేటికీ ఆదివాసీలకు శాపంగా మారాయి. మరోవైపు అత్యవసర వైద్యమందక గర్భిణులు, రోగులు వాగుల ఒడ్డునే ప్రాణాలు వదిలేస్తున్న సందర్భాలున్నాయి. ఈ స్థితిని చూసి పాలకులు, ప్రభుత్వాధికారుల గుండె కరగకపోవడం శోచనీయమే. మరోవైపు పసుపుల, మందపెళ్లి, రాజురా వంతెనల నిర్మాణం దశాబ్దాలుగా ఎందుకు అసంపూర్తిగా ఉందో సమాధానం చెప్పే నాథుడే లేడు. ఇంకోవైపు పోడు భూములే గిరిజనుడి జీవనాధారం. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పటాలివ్వకుండా అటవీ శాఖ అడ్డంకులు సృష్టించడం అన్యాయమే.

”అడవి మాది.. అడవిలో పుట్టిన చెట్టు, పుట్ట మావి.. కానీ మా భూమి మాది కాదా..?” అని పెంబి ప్రాంత గిరిజనులు పడుతున్న ఆవేదన నేడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకరకంగా ”అడవిని నమ్ముకున్న వాడికి అడవిపై హక్కు లేకపోవడం” ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం. పోడు భూములకు హక్కు పట్టాలివ్వకపోవడం ద్వారా ప్రభుత్వం గిరిజనులను వారి సొంత గడ్డపైనే ‘అక్రమణదారులు’గా చిత్రీకరిస్తోంది. అటవీ శాఖ ఆంక్షల పేరుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం జరుగుతున్న పరిస్థితి ఉందంటే గిరిజనుడికి ఆకాశమే కప్పుగా ఉండాలని శాసించడం కాక ఏమవుతుంది? ఆ మండలంలో త్రీ-ఫేజ్‌ విద్యుత్‌ లేక రైతులు పడుతున్న ఇబ్బందులు పారిశ్రామికీకరణ మాటల వెనుక ఉన్న డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. అడవి అంటే చెట్లు మాత్రమే కాదు, ఆ చెట్ల నీడన బతికే మనుషులు కూడా అని ఈ వ్యవస్థ గుర్తించకపోవటం దురదృష్టకరమైన అంశం.

ఇలాంటి అనేక సమస్యలన్నీ పెంబి మండలాన్ని వెనుకబాటు తనానికి సాక్ష్యంగా నిలుపుతున్నది. ఈ పరిస్థితుల్లో సిరిచల్మా నుంచి పులగంపండ్రి వరకు రహదారులు పడాలన్నా, ప్రతి గిరిజనుడికి పట్టా అందాలన్నా, కరెంటు వెలుగులు వికసించాలన్నా ఐక్యతతోనే సాధ్యం. పెంబి గడ్డపై జరుగుతున్న ప్రస్తుత పాదయాత్ర కేవలం నడక మాత్రమే కాదు, అభివృద్ధిని నిలదీసే అడుగు. అడవి బిడ్డల ఆత్మగౌరవం చాటడానికి, రాబోయే తరాల బంగారు భవిష్యత్తు కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.”పాలకులారా.. మాకు కావాల్సింది ఓట్ల పండగలో ఇచ్చే హామీలు కావు, మా వాగులపై వంతెనలు, మా భూములపై హక్కులు, మా గూడెంలో విద్యా, వైద్యం!” సొంతగూడు కావాలని ఈ పాదయాత్రలో వినిపించే ప్రతి అడుగు చప్పుడు పాలకుల నిద్రను చెడగొట్టేలా ఉండాలి. ఇది కేవలం సీపీఐ(ఎం) పిలుపు మాత్రమే కాదు, పెంబి గడ్డపై దశాబ్దాలుగా అణచివేయబడిన ఆవేదనకు ప్రతిపార్టీ, నాయకత్వం మద్దతుగా నిలువాల్సి ఉంది. లేదంటే ఆదివాసీల ఆత్మగౌరవం క్షమించదు.

  • రాజేందర్‌ దామెర
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -