జేటీసీపై దాడికి నిరసనగా పెన్‌డౌన్‌

– నిరసన చేపట్టిన ఆర్టీఏ అధికారులు, సిబ్బంది
– మద్దతు పలికిన ఉద్యోగ సంఘాల నాయకులు
– ప్రభుత్వం, రాష్ట్ర కమిషనర్‌ భరోసాతో పెన్‌డౌన్‌ విరమణ
– నల్లబ్యాడ్జీలతో విధులు కొనసాగించిన అధికారులు, సిబ్బంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ జేటీసీపై జరిగిన దాడిని నిరసిస్తూ.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో రవాణాశాఖ అధికారులు, సిబ్బంది పెన్‌డౌన్‌కు దిగారు. ఈ నిరసనకు అన్ని ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు తెలిపాయి. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. నిందితుడు ఆటో యూనియన్‌ నాయకుడు మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేశారు.
రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వ హించిన నిరసనలో గ్రేటర్‌ పరిధిలోని జేటీసీలు, డీటీసీలు, ఆర్టీవోలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వీరికి మద్ద తుగా టీఎన్జీవోస్‌ సెంట్రల్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ముజీబ్‌తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. ఆర్టీఏ ఉన్నతాధికారిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీఏ అధికారులు, సిబ్బంది పెన్‌డౌన్‌తో అప్పటికే ఆర్టీఏ స్లాట్‌ బుక్‌ చేసుకుని కార్యాలయాలకు వచ్చిన వినియోగదారులు రెండు గంటల పాటు ఇబ్బందులు పడగా పలు ఫిర్యాదులు కమిషనర్‌కు అందాయి. వెంటనే రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ ఆర్టీఏ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేటీసీపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా నిచ్చారు. కమిషనర్‌తో చర్చల అనంతరం అధికారులు, ఉద్యోగులు పెన్‌డౌన్‌ ఆలోచనను విరమించుకుని.. రోజంతా నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలుపుతూ ప్రజలకు సేవలందించారు. కొంత మంది వ్యక్తులు యూనియన్ల ముసుగులో నాయకులుగా చెలా మణి అవుతూ బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు పాల్పడుతూ.. అధి కారులు, ఉద్యోగులపై దాడులతో పాటు ఇబ్బందులకు గురిచేస్తు న్నారని తెలిపారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి వ్యక్తులను ఆర్టీఏ ఆఫీసుల్లోకి రాని యొద్దని.. దాడులకు పాల్పడే వారినుంచి తమకు రక్షణ కల్పిం చాలని అధికారులు, ఉద్యోగులు కోరారు. ఇలాంటి వాతావరణంలో ప్రజలకు సేవలు అందించాలేమని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారిపై జరిగిన దాడిని కొంతమంది వినియోగదారులు సైతం ఖండించారు. అదే సమయంలో తమను ఇబ్బందుల గురి చేయటం సరికాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా స్లాట్‌ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నాం 2గంటల తర్వాత కూడా సేవలు అందించామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
ఉద్యోగ సంఘాల మద్దతు..!
జేటీసీ రమేష్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. చేపట్టిన నిరసనకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. శుక్రవారం ఖైరతాబాద్‌ కేంద్ర కార్యాలయంలో ఆర్టీఏ అధికారులు, ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జేటీసీ రమేష్‌పై దాడిచేసిన అమానుల్లా ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రవాణాశాఖ కమిషనర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. జేటీసీపై దాడితో ఉద్యోగులంతా భయాందోళనలకు గురవుతున్నారని రవాణా శాఖ టెక్నికల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి. రవీందర్‌ కుమార్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. జేటీసీపై దాడి ఘటన హేయమని, ఈ ఘటన సకల ఉద్యోగులకు సంబంధించిన అంశమని గ్రూప్‌-1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, ప్రెసిడెంట్‌ ఎం.చంద్రశేఖర్‌ గౌడ్‌ తెలిపారు. గుర్తింపు లేని ఆటో యూనియన్లను బ్యాన్‌ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై దాడులు చేయడం సరికాదని టీఎన్జీవోస్‌ సెంట్రల్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.ఎం. హుస్సేని(ముజీబ్‌) చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, టీజీవోస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్‌, టీఎన్జీవోస్‌ ఆర్టీఏ-యూనిట్‌ అధ్యక్షులు ఎం.ఎన్‌.అరుణేందర్‌ ప్రసాద్‌, నాన్‌ టెక్నికల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డి. ప్రదీప్‌ రామకృష్ణ, జిల్లా అధ్యక్షురాలు ఏంజుల రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌. శ్రీనివాస్‌, తెలంగాణ లాస్ట్‌ గ్రేడ్‌ ఎంప్లాయీ యూనియన్‌ అధ్యక్షుడు జి. జ్ఞానేశ్వర్‌, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love