– పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కనీసం ఒక్క దాన్ని కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం నాలుగు నెలల్లో ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని చెప్పారు. సాగు, త్రాగునీరు, కరెంటు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలనల మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించారని తెలిపారు.కాంగ్రెస్ కు ప్రభుత్వానికి అధికారమదం తలకెక్కిందా అని జాతీయ జర్నలిస్ట్ బర్కాదత్ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఆ ప్రభుత్వ అహంకారాన్ని తగ్గించేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన ప్రజలకు సూచించారు.