
– జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ విధానం కల్పించినట్లుగానే, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. పోలింగ్ కేంద్రానికి కి రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సాక్ష్యం యాప్ ద్వారా, అలాగే ఫారం 12-డి లో హోమ్ ఓటింగ్ కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ లకు ఉద్దేశించి ఓటు హక్కు ప్రాధాన్యత పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ ఎన్నికలలో ఓటు వేసి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఓటు వేయడంతో పాటు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలని అన్నారు.
ట్రాన్స్ జెండర్లు ఓటు వేయడమే కాకుండా, ఓటింగ్ పై అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు. ఓటు అవగాహన పై ర్యాలీలు తీయాలని సూచించారు. ట్రాన్స్ జెండర్స్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 45 శాతం కంటే ఎక్కువ వికలత్వం ఉన్న పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. తక్కిన దివ్యాంగులు అందరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.దివ్యాంగులకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్ల ఏర్పాటు, ఓటు వేయడానికి అనుకూలంగా ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దివ్యాంగులను చైతన్యం చేయడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున దివ్యాంగులకై ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ పోలింగ్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది సైతం దివ్యాంగులే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, ఐసిడిఎస్ పిడి సక్కుబాయి, ట్రాన్స్ జెండర్స్ నాయకురాలు నందిని, తదితరులు పాల్గొన్నారు.