పేటలో చికెన్‌ సిండికేట్‌

– మాంసాహారులను దోచుకుంటున్న దుకాణాల యజమానులు
– మార్కెట్‌ ధరలు అనుసరించే వారిపై సిండికేట్‌ దాడులు
– స్వతంత్ర వ్యాపారులకు సహాయ నిరాకరణ
నవతెలంగాణ-అశ్వారావుపేట
మాంసం, మద్యం, విద్యా కాదేదీ సిండికేట్‌కు అనర్హం అనే రాష్ట్ర వ్యాప్త అంశాన్ని అశ్వారావుపేటలో పలు వ్యాపారాల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి రుజువు చేస్తున్నారు. అయితే గతంలో ఏ వ్యాపారులు అయిన సంఘాలుగా లేక యూనియన్‌లుగా ఏర్పాటు అయి వారి కార్యకలాపాలు నిర్వహించేవి. నేడు అవి యూనియన్‌లు లేక సంఘాలుగానే ఉనికిలో ఉన్నప్పటికీ సిండికేట్‌ అనే పదం పర్యాయ పదం అయింది. అశ్వారావుపేటలో ఇప్పటికే మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఉనికిలో ఉన్నారు. ప్రస్తుతం చికెన్‌ సెంటర్‌ల యాజమాన్యాలు ప్రస్తుతం సిండికేట్‌గా రూపాంతరం చెందింది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోనూ, అశ్వారావుపేటలో మొత్తంగా 15 నుండి 20 చికెన్‌ సెంటర్‌లు ఉన్నాయి. వీరందరూ సిండికేట్‌గా తయారై మార్కెట్‌ ధరకు మించి రూ.20లు నుండి రూ.60లు వరకు కేజీ చికెన్‌కు వసూలు చేస్తుంటారని పలువురు మాంసాహారులు తెలుపుతున్నారు. అయితే షౌకత్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని మార్కెట్‌ ధర కంటే రూ.10లు నుండి రూ.20లు వరకు కేజీ చికెన్‌ మాంసాన్ని విక్రయిస్తున్నాడు. పైగా ధర తెలిసేలా బోర్డు పెట్టి మరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో యూనియన్‌ నాయకులు తక్కువ ధరకు విక్రయించొద్దని, విక్రయించినా బోర్డు పెట్టవద్దని తెలిపారు. అయినా షౌకత్‌ తన పాత పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడంలో ఇతని షాపులో కార్మికుడు శ్రీనివాస్‌కు యూనియన్‌ నాయకుడు హేమంత్‌కు ధరలు విషయం అయి వివాదం చోటు చేసుకుంది. వివాదం కాస్తా గొడవకు దారితీసి కార్మికుడు శ్రీనివాస్‌పై దాడి చేయడంతో గాయాలు అయ్యాయని శ్రీనివాస్‌ పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ప్రస్తుతం మార్కెట్‌లో బ్రాయిలర్‌ చికెన్‌ కేజీ మాంసం రూ.239లు ఉంది. కానీ షౌకత్‌ రూ.200లకే బోర్డు పెట్టి విక్రయిస్తున్నారని యూనియన్‌ నాయకుడు హేమంత్‌ తెలిపారు. నా వ్యాపారం నా ఇష్టం అని నేను తక్కువుగా అమ్ముతున్నానని, మిగతా వ్యాపారులు నాకు సహాయం నిరాకరణకు పాల్పడుతూ కంపెనీల నుండి నాకు కోళ్ళు సరఫరా నిలిపి వేయాలని కంపెనీ వాళ్ళను డిమాండ్‌ చేస్తున్నారని షౌకత్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love