Wednesday, August 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

- Advertisement -

7న పాఠశాలల్లో నిరసనలు
పీఆర్సీ ప్రకటించేదాకా నల్ల బ్యాడ్జీలతో విధులకు 12,13 తేదీల్లో మండల కేంద్రాల్లో వినతిపత్రాలు
19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు 21 నుంచి 26 వరకు రాష్ట్ర, జిల్లా బృందాల పర్యటన
29న హైదరాబాద్ లో మహా ధర్నా సెప్టెంబర్ లో చలో అసెంబ్లీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ​

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూ.ఎస్‌.పీ.సీ) నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్ లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈనెల 7న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో పాఠశాలల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఆ రోజు నుంచి పీఆర్సీ ప్రకటించేదాకా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని తెలిపారు. 12,13 తేదీల్లో మండల కేంద్రాల్లో వినతిపత్రాల అందజేత, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 21 నుంచి 26 వరకు రాష్ట్ర, జిల్లా బృందాల పర్యటన, జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు, 29న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని, ఉపాధ్యాయులందరూ సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారుల వైఖరితో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యా రంగానికి 15 శాతం నిధుల కేటాయింపు హామీని విస్మరించారని, నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపునకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామంటూ ఘనంగా ప్రకటించినప్పటికీ వాటిని కేవలం యుకేజీకే పరిమితం చేశారని వాపోయారు. ప్రీ ప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12 గంటల వరకే నడుపుతున్నారని తెలిపారు. కానీ ప్రయివేటు పాఠశాలల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రీ ప్రైమరీ తరగతులు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత పసి పిల్లలను ఎవరు చూసుకుంటారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యకు నష్టం కలిగించే జీవో 25 ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రతీ తరగతికి ఒక టీచర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈవో, రెవెన్యూ డివిజన్ కు ఒక డిప్యూటీ ఈవో, అన్ని మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని కోరారు.

పీవో 2018కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈనెల 15 లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని కోరారు. టెట్ లో సర్వీసు వెయిటేజ్ ఇవ్వాలని, స్పెషల్ టెట్ ను సబ్జెక్టు వారీగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ ను రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2003 డీయస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్చాలని, మోడల్ స్కూల్స్ ను, ఎయిడెడ్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో 190 అమలు చేయాలని, 5 వాయిదాల కరువు భత్యం (డీఏ) ను వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రతీనెలా రూ.2 వేల కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలుకు చొరవ తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

​సీఎం మాటలే మాకు స్ఫూర్తి : చావ రవి
విద్యార్థుల సమస్యలపై ఉపాధ్యాయులు పోరాడాలన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలనే తాము స్ఫూర్తిగా తీసుకున్నామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి తెలిపారు. తమ డిమాండ్లు అన్ని విద్యారంగాన్ని బలోపేతం చేసేవేవని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వానికి తగినంత సమయమిచ్చామని తెలిపారు. సంయమనం పాటించామనీ, ప్రాతినిథ్యాలు కూడా చేశామని వివరించారు. అయినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల బలోపేతమంటే వాటిని కుదించడం కాదని హితవు పలికారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను నిరంతరంగా నిర్వహించాలని, ఆగస్టు 15లోపు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 25ను అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలహీనమవుతాయనీ, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే కుట్రలో భాగంగానే చేస్తున్నట్టు భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.అనిల్ కుమార్ మాట్లాడుతూ…సమస్యల పరిష్కారం కోసమే తన వద్ద విద్యాశాఖను పెట్టుకున్నానంటూ చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ పని మాత్రం చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికీ యూనిఫాంలు ఇవ్వలేదనీ, మౌలిక సదుపాయాలు కల్పించలేదని తెలిపారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తామని మాటలు చెబుతున్న సర్కారు జిల్లాల్లో కనీసం పర్యవేక్షక పోస్టులను భర్తీ చేయడం లేదని తెలిపారు. ఆయన మాటల్లో తప్ప చేతుల్లో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎ.వెంకట్(టీఎస్ యూటీఎఫ్), ఎన్.తిరుపతి(టీపీటీఎఫ్), ఎం సోమయ్య (డీటీఎఫ్), కొమ్ము రమేష్ (బీటీఎఫ్), మేడి చరణ్ దాస్ (ఎస్సీ,ఎస్టీ టీఎఫ్), ఎస్ హరికిషన్(టీటీఏ), బి.కొండయ్య (ఎంఎస్ టీఎఫ్), వై విజయ కుమార్, రవీందర్ (ఎస్సీ ఎస్టీ యుయస్) మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -