– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిజికల్ సైన్స్ టీచర్ల ఫోరం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్‌తోపాటు గణితం సబ్జెక్టును కూడా బోధించాలన్న నిబంధన వద్దని ఫిజికల్ సైన్స్ టీచర్ల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అజరుసింగ్, ప్రధాన కార్యదర్శి పి రాజశేఖర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు గణితం బోధించాలంటూ గతనెల మూడున 11143 మెమోను విద్యాశాఖ జారీ చేసిందని తెలిపారు. దానివల్ల పాఠశాలల్లో అనేక ఇబ్బందులు ఎదరయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఆ మెమోను వెంటనే సవరించాలని కోరారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కేటాయించిన పీరియెడ్లు సరిపోక అదనపు తరగతులను తీసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు సంబంధం లేని ఆరు, ఏడు తరగతులకు గణితం బోధించాలనడం సమంజసం కాదని పేర్కొన్నారు. దీనివల్ల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతారని తెలిపారు. విద్యాశాఖ ఇచ్చిన మెమోపు పున:పరిశీలించాలని కోరారు. ప్రొసీడింగ్ నెంబర్ 77ను అమలు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.