పోలింగ్ బూత్లను సందర్శించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ- తుంగతుర్తి :స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు అన్నారు. తుంగతుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలిసి అన్ని శాఖల అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోవు 50 రోజులు అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను గాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 24 గంటలు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అన్ని పోలింగ్ బూత్లను సందర్శించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్టును పగడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రచార మాధ్యమాలతో పాటు బ్యాంకు ఖాతాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పోలీసు శాఖ వారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దులో అక్రమంగా మద్యం డబ్బు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలో డబ్బు మద్యం బంగారం వెండి పట్టుకున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యాపేట అదనపు కలెక్టర్ ఏ వెంకట్ రెడ్డి, 9 మండలాలకు చెందిన తాసిల్దార్లు ఎంపీడీవోలు, స్టేషన్ ఆఫీసర్స్ , ఫ్లయింగ్ స్కాడ్స్, డిఎస్పిలు, నాగేశ్వరరావు, తుంగతుర్తి కాన్స్టెన్సీ ఎన్నికల ఇన్చార్జి డిఎస్పి రవి  ఇతర శాఖలకు సంబంధించిన తదితర అధికారులు పాల్గొన్నారు.

Spread the love