అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి పూలే

– ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలి
– మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, మేధావి, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మహిళలకు కూడా సమాజంలో గౌరవం తెచ్చే విధంగా స్ఫూర్తిని తీసుకువచ్చాడని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ  సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో తాను నల్లగొండలో ఎక్కడలేని విధంగా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జ్యోతిరావు పూలే సేవలను గుర్తించి ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించిందని అన్నారు. బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి  శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love