పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

– ప్రారంభమైన వ్యవసాయ పనులు..
– వరి, పత్తి, మొక్కజొన్న సాగుపై రైతుల దృష్టి..
– రైతన్నలకు సూచనలు చేస్తున్న అధికారులు..
నవతెలంగాణతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎ.శ్రీధర్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఈ ఏడాది వానాకాలం కాస్త లేటుగానే ప్రారంభమైందని చెప్పవచ్చు.తొలకరి వర్షాలు పలకరించడంతో రైతన్నలంతా పొలం పనులు ప్రారంభించారు.ఈ తరుణంలోనే ఎరువులు విత్తనాలు షాపులు రైతన్నలతో కిటకిటలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వరి,మొక్కజొన్న,పత్తి విత్తనాలు విత్తుతున్నారు. ఏ పంట వేస్తే బాగుంటుంది, రైతులు పండించే ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలలో రైతులు అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నవతెలంగాణ ఇంటర్వ్యూలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎ.శ్రీధర్ రెడ్డి రైతన్నలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రతి ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలోనే సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలైన ( జీలుగా, జనుము) రైతులు పొలాల్లో చల్లుకొని అవి పూత దశకు వచ్చిన తర్వాత కలియ దున్నాలి దీని ద్వారా భూసారం పెరిగి,చౌడు కూడా తగ్గుతుంది..
వరి సాగు:
పొలం తయారీ వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు నేలను కలియదున్నాలి.నాలుగు మూలలు సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టి గడ్డలు లేకుండా చూసుకోవాలి. పొలాన్ని చిన్నచిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తరువాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోవడానికి సులువుగా ఉంటుంది. ప్రస్తుతం వరి నాట్లు వేసే రైతులు స్వల్పకాలిక రకాలైన 120-125 కాల వ్యవధిగల రకాలను ఎంచుకోవాలి. నారుమడిని సిద్ధం చేసుకునేటప్పుడు విత్తనాలను మండి కట్టి రెండు నుంచి మూడు రోజుల పాటు అలా ఉంచిన తర్వాత 20 రోజుల ముందే దున్ని పెట్టుకున్న నారుమడిలో చల్లుకోవాలి.ఇందులో ముఖ్యంగా ఎకరా వరి సాగుకు 2 గుంటల నారుమడి సరిపోతుంది.ఈ 2 గుంటల నారుమడికిగాను 2 కేజీల నత్రజని,1 కేజీ బాస్వరం 1కేజీ ఫొటాష్ వంటి ఎరువులు వేసుకోవాలి.నారుమడి పీకడానికి వారం రోజుల ముందు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు ఇసుకలో కలిపి చల్లి, పల్చగా నీళ్లు పెట్టాలి. దీని ద్వారా ఉల్లికోడు కాండము తొలచు పురుగు నివారించవచ్చు.
డ్రమ్ సీడర్ పద్ధతి:
డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తినప్పుడు విత్తనాలు 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టిన గింజలను డ్రమ్ సీడర్లో వేసి విత్తుకోవాలి. డ్రమ్ సీడర్ కు 4 డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ములో 25 సెంటీమీటర్ల దూరంలో రెండు చివర్ల వరసకు 18 రంధ్రాలు ఉంటాయి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ లాగినప్పుడు 8 వరసలలో వరస వరసకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి.
పత్తి సాగు:
ఇక పత్తి విత్తనాలను 50 నుంచి 70 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అలాగే వర్షాలు పడ్డ తర్వాతనే విత్తుకోవడం మంచిది.పత్తి మంచి దిగుబడి రావాలి అంటే రైతులు సరైన ఎరువులు, యాజమాన్యం సస్యరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పత్తిలో అంతర పంటగ కందిని కూడా వేసుకోవచ్చు.ఇక పత్తి విత్తిన మూడు రోజుల తర్వాత పెండిమిథాలిన్ అనే మందును 1 ఎకరానికి 1000ఎం.ఎల్, పిచికారి చేయాలి. విత్తిన 20-30 రోజులకు క్విజ్జాలో పాస్ ఇథైల్ 400 ఎమ్.ఎల్ ఒక ఎకరానికి కలుపుకొని పిచికారి చేయడం వల్ల కలుపు మొక్కలను నియంత్రించవచ్చు.ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా 100-125 కేజీల యూరియా,150 కేజీల, ఎస్ ఎస్ పి,50 కేజీల ఫొటాష్ ఎరువులను వేసుకోవాలి.
కలుపు యాజమాన్యం కీలకం:
వెదజల్లు పద్ధతిలో కలుపు యాజమాన్యం కీలకం అని ఆరుతడి పద్ధతిలో నీటితడులు పెట్టడం మూలంగా కలుపు ఎక్కువగా పెరుగుతుంది. కలుపును నివారించడానికి విత్తనం వేసుకున్న మూడురోజుల్లో కలుపు మందును చల్లుకోవాలి. అనంతరం 25 రోజులకు మరొక్కసారి కలుపుమందు చల్లుకోవాలి. దీంతో కలుపు మొలకెత్తదు.కలుపుమందులు వేసుకోవడంతో కూలీల అవసరం రాదు. అయితే కలుపు నివారణ కోసం స్థానిక వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన మందులనే ఉపయోగించాలి.మార్కెట్ లో వెదజల్లే పద్దతిలో కలుపు నివారణను అరికట్టే కలుపుమందులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. వెదజల్లే పద్ధతిలో ఏడు నుండి పది రోజులు ముందుగా కోతకు వస్తుంది. నాట్లు వేసే పని ఉండదు కాబట్టి ఎకరాకు రూ.2500 నుండి రూ.3000 పెట్టుబడి ఆదా అవుతుంది. నారుమడి పద్ధతిలో ఎకరాకు 25-30 కేజీల విత్తనం అవసరం ఉంటుంది.నారు పెరగడానికి 30 రోజుల సమయం పడుతుంది. నారు మడికి రూ.రెండువేలకు పైగా ఖర్చవుతుంది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడానికి ఎకరాకు 12-15 కిలోల విత్తనం మాత్రమే అవసరమ వుతుంది. నాట్లకు,కలుపుతీతకు కూలీల ఖర్చు అసలే ఉండదు. వెదజల్లే పద్ధతిలో ప్రత్యేకంగా నారు పెంచే అవసరం ఉండదు కాబట్టి మామూలు సాధారణ సాగుకన్నా పంట త్వరగా కోతకు వస్తుంది. ఇది యాసంగిలో ఏప్రిల్, మే నెలలో వచ్చే వడగండ్లు,చెడగొట్టు గాలివానల నుండి పంట నష్టం జరగకుండా తప్పించుకోవచ్చు.
మొక్కజొన్న:
మొక్కజొన్న పంటలు అధిక దిగుబడులు సాధించాలంటే పోషకలోప నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.మొక్కజొన్నలో ప్రధానంగా వచ్చే సమస్య కత్తెర పురుగు.దీని నివారణకు మొదటి దశ నుండి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.ఈ పురుగు ఉధృతి ఎక్కువైతే తయామితాక్సిమ్ అలాగే లామ్డా సహలోత్రిన్ అనే మందులను 0.4ఎం.ఎల్ లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేయాలి.
ఆయిల్ ఫామ్ పంట రాయితీ:
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పాము పంటకు రాయితీ అందిస్తుంది.దీన్ని రైతులంతా ఉపయోగించుకొని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలి.ఈ పంట నాలుగేళ్లలో దిగుబడి వస్తుంది.కాబట్టి మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఈ పంటను రైతులు ఉపయోగించుకొని వేసుకోవాలి.
పశువుల ఎరువులు వాడాలి:
వరి నాటు వేసే ముందు డీఏపీతోపాటుగా పశువుల ఎరువును ఎక్కువగా వేసి కలియదున్నుకోవాలి. దీనివల్ల పంట ఏపుగా పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తుంది.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 5.41 లక్షల ఎకరాలలో సాగు:
సూర్యాపేట జిల్లాలో సాగు అంచనా 5,41,450 ఎకరాలు పంటలు సాగు కానున్నాయి. జిల్లాలో గత ఐదేళ్లుగా పంట సాగు విస్తరణ భారీగా పెరిగింది.గతంలో 4లక్షల ఎక రాలకే పరిమితమైన పంట సాగు నేడు 5 లక్షల వరకు చేరుకుంది.ఒక పక్క కృష్ణా జలాలు,గోదా వరి జలాలు, మరోపక్క మూసీ జలాలతో పంట సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.రైతుల ప్రధాన పంట వరిసాగు కాగా రెండో పంటగా పత్తి సాగు నిలుస్తుంది.అధికారులు ఈ ఏడాది పంట సాగు 5,41,450 ఎకరాలు సాగు కానున్నట్లు అంచన వేశాం.ఇందులో వరి 4,45,800 ఎక రాలు,పత్తి 80వేల ఎకరాలు, మొక్క జొన్న 75, కంది 2400 ఎకరాలు, పెసరా 1500 ఎకరాలు, వేరుశనగ 400 ఎకరాలు, చెరుకు 300 ఎకరాలు, మిర్చి 21వేల ఎకరాలు, ఫాం అయిల్ 2200 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నట్లు తెలుస్తుంది.
రైతులకు అందుబాటులో విత్తనాలు..ఎరువులు:
పంట సాగుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికా రులు రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం నుండి రాయితీపై వచ్చే విత్తనాల గురించి రైతులకు తెలియపరుస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వరి విత్తనాలు 75,856 క్వింటాలు, కంది 96 క్వింటాలు, పెసరా 120 క్వింటాలు, జోన్న 6 క్వింటాలు, వేరుశనగ 240 క్వింటాలు, పత్తి 1,80వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే యూరియా 60,866 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా 30,643 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా,డిఎపి 14,996 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా 1,849 అందుబాటులో ఉంది. ఎంపివో 9,738 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 478 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 43,011 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా 13,666 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే ఎస్ఎస్పి 5,859 మెట్రిక్ టన్నులకు గాను 416 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
రైతు బీమా చేసుకోవాలి:
తప్పనిసరిగా కొత్తగా పట్టా పాస్ బుక్కులు వచ్చిన రైతులంతా రైతు బీమా చేసుకోవాలి.జూలై 10న, బీమా ప్రారంభమై ఆగస్టు 5  కొరకు ఉంటుంది కావున రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ – కార్డు, అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ లు తీసుకొని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో అందించాలి.
Spread the love