పసిడి డిమాండ్‌కు ధరల దెబ్బ

Price hit for raw material demand– ఈ ఏడాది అమ్మకాలు తగ్గొచ్చు
– డబ్ల్యుజిసి అంచనా
ముంబయి : ఈ ఏడాది బంగారానికి డిమాండ్‌ తగ్గొచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఇందుకు అధిక బంగారం ధరలే కారణమని డబ్ల్యుజిసి ఇండియా ప్రతినిధి సచిన్‌ జైన్‌ పేర్కొన్నారు. గతేడాది బంగారం వినియోగం తొమ్మిదేండ్ల గరిష్ట స్థాయికి చేరిందన్నారు. ఈ ఏడాది 700-800 మెట్రిక్‌ టన్నుల పసిడికి డిమాండ్‌ ఉండొచ్చన్నారు. గతేడాది ఇది 802.8 టన్నులుగా చోటు చేసుకుంది. 2015 తర్వాత ఇదే అత్యధిక అమ్మకాలన్నారు. రికార్డ్‌ స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు మొదట ఆభరణాల వినియోగదారులను ప్రభావితం చేస్తాయన్నారు. వరుసగా పెరుగుతున్న ధరలు డిమాండ్‌ను దెబ్బతీయనున్నాయన్నారు. దేశీయంగా బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.84,399కి చేరింది. 2024లోని ధరతో పోల్చితే 21 శాతం పెరిగింది. అమెరికా టారిఫ్‌ యుద్ధ భయాలతో 2025లో ఇప్పటివరకు 10 శాతం ఎగిశాయి. ఆభరణాలను కొనుగోలు చేసే కుటుంబాలకు ఒక నిర్ణీత బడ్జెట్‌ ఉంటుందని, బంగారం ధరల పెరుగుదలతో సమానంగా వారి బడ్జెట్‌ పెరగదని సచిన్‌ జైన్‌ తెలిపారు. దేశంలోని మొత్తం బంగారం డిమాండ్‌లో ఆభరణాల వాటా దాదాపు 70 శాతంగా కాగా.. మిగితా 30 శాతం పెట్టుబడి డిమాండ్‌గా ఉంది.

Spread the love