– రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకష్ణారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రైతులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో రైతు సంఘం మండల కమిటీ సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి ముసలయ్య హాజరై మాట్లాడుతూ దండుమైలారం నెర్రపల్లి గ్రామాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని, దాని ఫలితంగానే నెర్రపల్లి గ్రామంలో రైతులకు భూమి పరిహారం కింద 600 గజాలు ఇస్తామని ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అదే విధంగా దండుమైలారం గ్రామంలోని ఆఫీస్ పూర్ రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తామని ఆర్డిఓ తెలియజేశారని, ఇది రైతు సంఘం సాధించిన విజయమని ఆయన తెలియజేశారు. అనంతరం రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతులంతా ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు సాధిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగం మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినందుకు ప్రభుత్వం దిగివచ్చి చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే సరిచేయాలని కోరారు. లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు గూడెం అశోక్, డి అశోక్, యాదయ్య, జంగయ్య, వెంకటేష్, జి. జంగయ్య, లింగస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.