Tuesday, April 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్...

రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్ బాబు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చేసి దాని స్థానంలో మనుస్మృతి ప్రవేశపెట్టి దేశ ప్రజలందరినీ తిరిగి మద్యయుగాల కాలంలోకి తీసుకెళ్ళజూస్తున్నారు. మనువాద దుష్ట విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేయడమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అర్పించే నిజమైన నివాళి అని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.

మంగళవారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ , విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదమరాజు, కెవిపిఎస్ సీనియర్ నాయకులు బొల్లి చెన్నయ్య, బాగ్యమ్మలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ సర్కార్ పైకి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కుతూ మరో వైపు అంబేద్కర్ ఆశయాలను తొక్కుతుందని విమర్శించారు.

మాకు 400 సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తామని బీజేపీ మంత్రులే ప్రకటించారని చెప్పారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినా బీజేపీ సర్కార్ మనుస్మృతి విధానాలను అమలు చేస్తుందని చెప్పారు.కార్మిక వర్గాన్ని ఐక్యం కానీయకుండా కుట్రలు చేస్తుందన్నారు. కోట్లాదిమంది కార్మికులు వందలాది సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ సర్కార్ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల శ్రమను కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు. నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కార్మికులకు కనీస వేతనం కోసం చట్టం కోసం కృషి చేస్తే నేటి బిజెపి సర్కార్ కార్మికుల పొట్టలు కొడుతుందని విమర్శించారు. కులం పునాదుల మీద ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేమని చెప్పారు అంబేద్కర్ కులరహిత సమాజం కోసం తన తుది శ్వాస వరకు కృషి చేశాడని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయం కుల నిర్మూలనే అని చెప్పారు. కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను ఏప్రిల్ నెల ను మహనీయుల మాసంగా పాటిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 26న హైదరాబాద్ లో జరుగు కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -