సహజ మరణానికీ రూ. 15 లక్షలు ఇన్సూరెన్స్‌ ఇప్పించండి

– యాజమాన్యానికి టీజీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో కార్మికులు, ఉద్యోగుల సహజ మరణానికి కూడా రూ.15 లక్షలు ఇన్సూరెన్స్‌ వచ్చేలా చర్యలు చేపట్టాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఏ, ఎమ్‌, పీ అండ్‌ ఏఎమ్‌)కు ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సోమవారం వినతిపత్రం సమర్పించింది. ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు ఆ వివరాలు వెల్లడించారు. టీజీఎస్‌ఆర్టీసీలో సర్వీస్‌లో ఉండి, ఏ కారణంతో అయినా జరిగే సహజ మరణానికి కూడా కనీసం రూ.15 లక్షలు ఆ కుటుంబానికి అందేలా యూనియన్‌బ్యాంక్‌తో సంప్రదింపులు జరిపాలని కోరారు. యూనియన్‌బ్యాంక్‌లో సూపర్‌ సేలరీ అక్కౌంటు కలిగి, ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.1 కోటి 15 లక్షలు ఇన్సూరెన్స్‌ ద్వారా చెల్లిస్తున్నారనీ, ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి అది బాగా సహాయపడుతుందని చెప్పారు. అదే తరహాలో సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి కూడా రూ.15 లక్షలు ఇన్సూరెన్స్‌ వచ్చేలా స్కీం రూపొందించాలని కోరారు.
కార్మికుడు / ఉద్యోగి నుంచి నెలవారీగా వంద రూపాయలు రికవరీ చేసుకొని, కనీస మొత్తం రూ.15 లక్షల ఇన్సూరెన్స్‌ వచ్చేలా యూనియన్‌ బ్యాంక్‌తో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్కీంను ప్రారంభించే క్రమంలో ప్రీమియం నెలకు వంద రూపాయలు మాత్రమే ప్రీమియం వుండేలా చూడాలనీ, ఐదేండ్ల తర్వాతే దీనిపై సమీక్ష చేసేలా నిబంధన ఉండాలని సూచించారు. ఇన్సూరెన్స్‌ చెల్లింపునకూ, హాజరుకు ఎటువంటి సంబంధం లేకుండా చూడాలని కోరారు.

Spread the love