పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాల ఏర్పాటు

– ఓటర్లందరూ  నిర్భయంగా, స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు  వేయాలి
– జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పిలుపు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ పార్లమెంట్ నియోజకర్గానికి  సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటీలన్నింటిని  పూర్తిచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి పోలింగ్ బృందాలన్నీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని ఆమె వెల్లడించారు.ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటుచేసిన పార్లమెంటు ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ఆమె  సందర్శించారు. అక్కడ పోలింగ్ సిబ్బంది మెటీరియల్ పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను, సిబ్బందికి భోజన, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లలో పెద్ద ఎత్తున అవగాహన చేపట్టడం జరిగిందని చెప్పారు.  వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలలో నీడ, తాగునీరు, టాయిలెట్స్ తోపాటు, మెడికల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సెక్టోరల్ అధికారులతో పాటు, అంబులెన్స్ లు  సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 11వ తేదీ  సాయంత్రం నుండి ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు 85 ఎఫ్ఎస్ టి, ఎస్ ఎస్ టి, విఎస్టి, వివిటి బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయని, ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సి- విజిల్ ద్వారా ఇప్పటివరకు 180 ఫిర్యాదులు రాగా, వాటన్నిటిని కేవలం 55 నిమిషాల లోపే  బృందాలు ఆ ప్రదేశాలకు వెళ్లి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కు  సర్వం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో రవి రవికుమార్, డిఆర్డిఓ నాగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్  తదితరులు ఉన్నారు.
Spread the love