పుడమి పండగా… సాగు పండుగ

– నేడు ఏరువాక పౌర్ణమి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
దేశానికి అన్నం పెట్టేది రైతే… సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా… ఎన్ని ఆవిష్కరణలు చేసినా… కర్షకుడు భూమి దున్ని పంటలు పండించకపోతే ప్రజల ఆకలి తీరదు. అటువంటి రైతన్న పంటల సాగుకు ఉపక్రమించే పండగ రోజే ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఏరువాక పండుగ నిర్వహించుకుంటారు.

వ్యవసాయ పనులకు శ్రీకారం…

రైతులు తమ వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ముందుగా ఏరువాక పౌర్ణమి రోజున తమ పొలాల్లో భూమిపూజ చేస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. నాగలి కట్టి, కాడెద్దులతో దుక్కిదున్నటాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే దున్నటానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే ఎద్దులను కట్టి పొలం దున్నే పనులు ప్రారంభించటమని అర్థం. తొలకరి జల్లుల ఆగమనాన్ని ఆహ్వానిస్తూ రైతన్నలు ఆనందోత్సాహాల మధ్య అరక దున్ని పొలం పనులు మొదలు పెట్టటమే కాకుండా కొన్నిచోట్ల ఎడ్ల పందాలను సైతం నిర్వహిస్తారు.
రైతన్నల ప్రత్యేక పూజలు..
భారతీయులు పాటించే సంప్రదాయాలన్నీ ప్రకృతితో మమేకమై ముడిపడినవే. పంట పండాలంటే దానికి అనువుగా భూమిని సిద్ధం చేసుకోవాలి. భూమిని దేవతగా భావించి రైతులంతా తమ పొలాల్లో భూమిపూజ చేస్తారు. ఏరువాక పూర్ణిమ వర్ష రుతువుకు ఆరంభ సూచిక. పౌర్ణమి అందరికీ ఇష్టమూ, ఆరాధ్యమే అయినందున దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వర్ష రుతువు వ్యవసాయ పనులకు ఆరంభ దశ కాబట్టి రైతన్నలు ఉదయమే తమ దుక్కిటెడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. వాటికి గజ్జెలు కట్టి పూలతో అలంకరిస్తారు. తర్వాత నాగలి/కాడికి, ఎడ్లకు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యంగా చేసిన పొంగలిని తినిపిస్తారు. సామూహికంగా రైతులంతా తమ ఎడ్లను తోలుకుని పొలాలకు వెళ్తారు.కొత్త వ్యవసాయ సంవత్సరం ఆరంభం ఏరువాక అతి ప్రాచీనమైన చరిత్ర గల పండుగ. హలుడు రాసిన ‘గాధా సప్తశతి’లోనూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏరువాక గురించి, రైతన్నల గురించి ప్రస్తావన వచ్చిందని చెబుతారు. ఇదే రోజున రైతుల ఇళ్లలో పని చేసే పాలేర్లు, పనివాళ్ల సంవత్సరం ఒప్పందం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది.
Spread the love