ఇంధన స్టోరేజీ ఉత్పత్తుల్లోకి ప్యూర్‌

Pure enters energy storage products– ప్యూర్‌పవర్‌ హోమ్‌ ఆవిష్కరణ
నవ తెలంగాణ – హైదరాబాద్‌
ప్రముఖ ద్విచక్ర విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ప్యూర్‌ కొత్తగా ఇంధన స్టోరేజీ ఉత్పత్తుల్లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఇవి రంగంలో ఉన్న ఈ కంపెనీ మంగళవారం హైదరాబాద్‌లో ప్యూర్‌పవర్‌ ఎనర్జీ స్టోరేజీ ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిని నిటి అయోగ్‌ సభ్యుడు, డీఆర్‌డీఓ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వికె సారస్వత్‌ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్యూర్‌ ఫౌండర్‌, ఎండీ నిషాంత్‌ డొంగరి మీడియాతో మాట్లాడుతూ.. తాము కొత్తగా ప్యూర్‌పవర్‌ హోమ్‌, ప్యూర్‌ పవర్‌ కమర్షియల్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని.. త్వరలోనే ప్యూర్‌పవర్‌ గ్రిడ్‌ ఉత్పత్తులను విడుదల చేయనున్నామని చెప్పారు.
వీటితో విద్యుత్తును నిల్వ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా వాడుకునేందుకు వీలుందన్నారు. ఇవి సాధారణ యూపీఎస్‌లలో మాదిరిగా వీటిల్లో లెడ్‌ ఆక్సైడ్‌ బ్యాటరీలు కాకుండా.. అత్యాధునిక లిథియం-అయాన్‌ బ్యాటరీలను ఉపయోగించామ న్నారు. సౌర విద్యుత్తు లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా ఎటువంటి అదనపు పరికరాల అవసరం లేకుండా నిల్వ చేసుకోవచ్చన్నారు. ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్‌ ప్యానెల్స్‌తో వచ్చే విద్యుత్‌ను ఇంటికి వాడుకోవడంతో పాటుగా.. మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు విక్రయించుకోవచ్చన్నారు. ప్యూర్‌పవర్‌ హోమ్‌ ధర రూ.74,999గా ప్రారంభమవుతుందన్నారు. ఇవి 3కెవిఎ, 5కెవిఎ, 15కెవిఎ సామర్థ్యాల్లో లభిస్తాయన్నారు. వచ్చే 18 నెలల్లో 300 మంది డీలర్ల ద్వారా ఈ ఉత్పత్తులను మార్కెట్‌ చేయనున్నామన్నారు. గ్రిడ్‌ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే ‘ప్యూర్‌ పవర్‌: గ్రిడ్‌’ను వచ్చే ఏడాది అందుబాటులోకి తేనున్నామన్నారు.

Spread the love