అభివృద్దిని మరిచి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు: పుట్ట మధుకర్‌

– మంత్రికి చిత్తశుద్ద ఉంటే చిన్న కాళేశ్వరానికి నిధులు వచ్చేవి
– రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత తీసుకున్నం
– కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయి బీఆర్‌ఎస్‌నే ఆదరిస్తున్నారు
– మీట్‌ ద ప్రెస్‌లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్
నవతెలంగాణ – మహాదేవపూర్
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన మంత్రి ఈ ప్రాంత అభివృద్దిని మరిచి అరాచకాలను ప్రోత్సహిస్తోండ్లని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.  మంథని పట్టణంలోన రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో ఐదేళ్లు పదవి పోయి, మరో ఐదేళ్ల అధికారంలో లేకుండా ఉండి అధికారంలోకి వచ్చిన మంథని ఎమ్మెల్యే ఈ ప్రాంత అభివృద్దిపై దృష్టి సారించకుండా ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొసలి కన్నీళ్లు కార్చి అధికారంలోకి వచ్చారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని ఆయన విమర్శించారు. అభివృద్ది సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా ఇప్పటి వరకు 35ఎంఎం ట్రయల్‌ మాత్రమే చూశారు, ఇక ముందు 70ఎంఎం సినిమా చూపిస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లో చిన్న కాళేశ్వరం పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడం, తాడిచర్ల భూపాలపల్లి రోడ్డు నిర్మాణం కోసం నిధులు తీసుకురావాలనే ఆలోచన చేయలేదన్నారు. ఐదు మాసాల్లో ఈ ప్రాంత అభివృద్ది కోసం ఆలోచన  చేసిఉంటే ఓడేడ్‌ బ్రిడ్జి కూలిపోయేది కాదని ఆయన అన్నారు. కేవలం మూడు నాలుగు కోట్ల నిధులు తీసుకు రావడంలో మంథని ఎమ్మెల్యే విఫలం అయ్యాడని ఆయన విమర్శించారు. నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్షలు చేయకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై రౌడీ షీట్లు ఎలా ఓపెన్‌ చేయాలని, ఇక్కడ ఉన్న సంపదను ఎలా తరలించాలనే ఆలోచన చేశారని ఆయన వివరించారు. మంథని నుంచి మొదలు మహదేవ్‌పూర్‌ వరకు ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించారని, ఎక్కడ చూసినా ఇసుక డంపులే దొరుకుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఐదు మాసాల కాలంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ప్రజలకు ఇచ్చిన హమీలపై దృష్టిపెట్టకుండా కాలం వృదా చేశారన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇక్కడ మంథని ఎమ్మెల్యే ఒక్కటేనని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈనాడు ఎన్నికల సమయంలో రాజ్యాంగం మారుస్తారని బీజేపీపై విషప్రచారం చేస్తున్నకాంగ్రెస్‌కు బుద్ది చెప్పేలా రాజ్యాంగంపై అవగాహన కల్పించే బాధ్యత తామే తీసుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగం గురించి తెలియక పోవడం మూలంగానే 50ఏండ్లుగా మూడు ఓట్లు ఉన్న ఒక్క కుటుంబం, మూడు వందలు ఉన్న ఒక్క కులం, కాంగ్రెస్‌ పార్టీ ఇంత పెద్ద సమాజాన్ని ఏలుతోందన్నారు. తాము పట్టుమని పదిమంది ఉన్నా పిడికిలి బిగించి పోరాటంచేస్తామన్నారు. భయానికో ప్రలోభాలకో పదవుల కోసం పార్టీ మారినోళ్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, పార్టీ మారినోళ్ల ఇంట్లో పించన్‌ రావాలన్నా, రైతుబంధు రావాలన్నా, ఇతర పథకాలు రావాలన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని గుర్తించాలన్నారు. పార్టీ మారినా వారు తల ఎత్తుకునేలా చేసేది బీఆర్‌ఎస్‌ పార్టీ అని గుర్తించాలన్నారు. గ్యారెంటీ పథకాలు, హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ప్రజల్లో విశ్వసం కోల్పోయిందని, ప్రజలు కాంగ్రెస్‌పార్టీపై నమ్మకం లేక బీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు ప్రజలు మద్దతుగా నిలిచారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీకి భయపడకుండా పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి నిలబడ్డ ప్రతి కార్యకర్తతో పాటు ప్రజాసంక్షేమం, అభివృద్దిని చూసి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా ఆయనధన్యవాదాలు తెలిపారు.
Spread the love