నాణ్యమైన విద్యే ప్రధాన లక్ష్యంగా బిఏఎస్

– డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక
– రెండు మూడు రోజుల్లో జాయినింగ్ ఆర్డర్లు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకానికి శ్రీకారం చుట్టింది.ఈ పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒకటవ, ఐదవ తరగతి,ఎస్సీ విద్యార్థులనుఈ పథకం ద్వారా ఎంపిక చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో బి ఏ ఎస్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో విద్యార్థుల ఎంపిక పూర్తయింది. 1వ తరగతిలో ప్రవేశానికి 134 సీట్లకు గాను 313 దరఖాస్తులు వచ్చాయి. ఐదవ తరగతికి సంబంధించి 137 సీట్లకు గాను 418 దరఖాస్తులు లాగా డ్రా పద్ధతిలో విద్యార్థులను అధికారులు ఎంపిక చేశారు. 33 శాతం  కోటా కింద ఒకటవ తరగతికి సంబంధించి 44 మంది అమ్మాయిలను, 90 మంది జనరల్ విద్యార్థులను ఎంపిక చేశారు. అదేవిధంగా ఐదవ తరగతికి సంబంధించి  45 మంది అమ్మాయిలను 92 మంది జనరల్ విద్యార్థులను ఎంపిక చేశారు. కాగా ఎంపికైన విద్యార్థులకు రెండు, మూడు రోజుల్లో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి వారికి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి డిడి రమేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంచార్జ్ అధికారి రాజ్ కుమార్, డి ఐ రాజు,  కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున,తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి..
బిఏఎస్ పథకం కింద గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి బుధవారం జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో డిఆర్ఓ రాజ్యలక్ష్మి, ఇంచార్జ్ డిటిడిఓ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేశారు. మూడవ తరగతికి సంబంధించి లంబాడ కు చెందిన 83 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 49 మంది విద్యార్థులను డ్రా ద్వారా ఎంపిక చేశారు. అదేవిధంగా ఎరుకల కులానికి సంబంధించి ఆరు దరఖాస్తులు  రాగా ఇద్దరిని   ఎంపిక చేశారు. ఐదవ తరగతికి సంబంధించి లంబాడ విద్యార్థుల నుండి 148   దరఖాస్తుల రాగా  25 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. అదేవిధంగా ఎరుకలకు సంబంధించి 14 దరఖాస్తులు లాగా ఇద్దరిని  ఎంపిక  చేశారు. 8వ తరగతికి  లంబాడకు సంబంధించి 51 దరఖాస్తు లాగా 24 మందిని ఎంపిక చేశారు.ఎరుకలకు సంబంధించి 16 దరఖాస్తులు  రాగా ఒక్కరిని ఎంపిక చేశారు. చెంచులకు సంబంధించి 11 సీట్లు కేటాయించగా విద్యార్థులు లేకపోవడం వల్ల 7 సీట్లను మాత్రమే భర్తీ చేశారు. 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి మొత్తం 114 సీట్లకు గాను 110 మంది విద్యార్థులను డ్రా ద్వారా  ఎంపిక చేశారు. విద్యార్థులకు ఈనెల 20న కౌన్సిలింగ్ నిర్వహించి  సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అదేరోజు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎటిడిఓ లక్ష్మారెడ్డి,  ఏవో జాఫర్, సెక్టోరియల్ అధికారి రామచంద్రయ్య, శిక్షణ అధికారి అతిక్, విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
అనగారిన వర్గాలపై ఇంకా చిన్న చూపేనా..!
బెస్ట్ అవైలబుల్ స్కీమ్  కు సంబంధించి విద్యార్థుల ఎంపికలో   జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖ జిల్లా అధికారి,  తప్పనిసరిగా పాల్గొనాలి. అయితే ఇక్కడ మాత్రం వారెవరు కార్యక్రమంలో పాల్గొనకుండా కింది స్థాయి అధికారులను పంపించి కార్యక్రమాన్ని   తూతు.. మంత్రంగా పూర్తి చేశారు. ఈ క్రియను బట్టి ఎస్సీ, ఎస్టీలపై వీరికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే  అర్థమవుతుంది. ఎస్సి, ఎస్టి, విద్యార్థులు అంటే అధికారులకు కూడా చిన్న చూపేనా అని విద్యావేత్తలు విస్మయం  వ్యక్తం చేస్తున్నారు.  బెస్ట్ అవైలబుల్ పథకానికి సంబంధించి జిల్లాస్థాయిలో కమిటీ ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎవరు కూడా విద్యార్థుల ఎంపిక కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే కలెక్టర్ ఒకవేళ బిజీ షెడ్యూల్ కారణంగా రాలేని  పరిస్థితుల్లో  కనీసం  అదనపు కలెక్టర్ నైనా పంపించి ఉండాల్సిందని పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘ నాయకులు  పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం యొక్క లక్ష్యం ఉన్నతమైనదే.. అమలు చేసే పద్ధతిలో మాత్రం విద్యార్థులు  తీవ్రంగా నష్టపోతున్నారని వారు  ఆరోపిస్తున్నారు. వాస్తవానికి విద్యా హక్కు  చట్టం ప్రకారం ప్రతి ప్రవేటు పాఠశాలలో ఈ పథకాన్ని అమలయ్యే విధంగా అమలు చేస్తూ  దాని నియమ నిబంధనలకు  అనుగుణంగా కనీసం నెలకు మూడు సార్లలయినా ఉన్నతాధికారులు పర్యవేక్షణ, తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పర్యవేక్షణ లేకపోవడం వల్ల గత సంవత్సరం సీట్ల పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను  సంబంధిత పాఠశాల యాజమాన్య వారు  అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారు.  అంతేకాకుండా  కనీసం మానవతాయిన పాటించడం లేదని ఉన్నత స్థాయి అధికారులకు  ఎన్నిసార్లు విన్నవించిన ఆ వినతి పత్రాలను కూడా  బుట్ట దాఖలు చేశారు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కిల్ కింద సీట్లు  కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా సీట్లు ఇవ్వని పాఠశాలలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యా హక్కు చట్టానికి సంబంధించి జీవోలు, నియమ నిబంధనలు,  ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమలు చేయకపోవడమే కాకుండా నిరుపేద విద్యార్థుల నుండి ముక్కు పిండి మరి ఫీజులను వసూలు చేస్తున్నారని   విద్యార్థుల తల్లిదండ్రులు  ఆవేద చెందుతున్నారు. ఇదే విషయమై గతంలోనే  జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, డిఇఓ కు ఫిర్యాదు చేసిన నేటికి చర్యలు తీసుకోకపోవడం విచారకరం. అయితే ఇప్పటికైనా ఇలాంటి పాఠశాలలపై ఉక్కు పాదం మోపి అటు  చట్టపరమైన చర్యలను, ఇటు శాఖ పరమైన చర్యలను అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు కోరుతున్నారు.
Spread the love