రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ

రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ– మూడో రాష్ట్రంలోనూ తెరపైకి కొత్త మొఖం
– సంఫ్‌కు సన్నిహితుడు,తొలిసారి గెలిచినా బీజేపీ హైకమాండ్‌ మొగ్గు
– వసుంధర రాజేకు మొండిచేయి
జైపూర్‌ : రాజస్థాన్‌ ఎన్నికలై వారంరోజులయ్యాక..ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించింది. ఈసారి బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, భజన్‌ లాల్‌ శర్మను ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని చేసింది. భరత్‌పూర్‌ నివాసి భజన్‌ లాల్‌ శర్మ చాలా కాలంగా బీజేపీలో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగుసార్లు పనిచేశారు. పార్టీలోలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ముఖ్యమంత్రి పదవిని బహుమతిగా ఇచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైపూర్‌లోని సంగనేర్‌ వంటి సురక్షితమైన స్థానం నుంచి బీజేపీ మొదటిసారిగా భజన్‌ లాల్‌ శర్మను బరిలోకి దింపింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అశోక్‌ లాహౌటీకి టిక్కెట్‌ ఇవ్వకుండా, భజన్‌లాల్‌ శర్మను అభ్యర్థిగా నిలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48081 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
భజన్‌ లాల్‌ శర్మ రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి 1993లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (ఎం.ఏ పాలిటిక్స్‌) చేశారు.
పెండింగ్‌లో రెండు కేసులు…
భజన్‌లాల్‌ శర్మపై ఐపీసీ సెక్షన్ల కింద రెండు కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 353 కింద కేసు నమోదై ఉన్నాయి. (ప్రభుత్వ ఉద్యోగి విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్‌ శక్తులకు సంబంధించినది). రెండవ కేసు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 149 కింద నమోదై ఉన్నది. (ఒక సాధారణ వస్తువును ప్రాసిక్యూషన్‌ చేయడంలో నేరానికి పాల్పడిన చట్టవిరుద్ధమైన అసెంబ్లీలోని ప్రతి సభ్యునికి సంబంధించినది).
కొత్త సీఎం ఆస్తులు ..
రాజస్థాన్‌ కొత్త సీఎం భజన్‌ లాల్‌ శర్మ మొత్తం ఆస్తులు రూ. 1.40 కోట్లు, అప్పులు రూ. 35 లక్షలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ ప్రకారం మొత్తం నికర విలువలో రూ. 1,15,000 నగదు కాగా, ఆయన వద్ద దాదాపు రూ.11 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. మూడు తులాల బంగారం ఉంది, దాని విలువ రూ.1,80,000. అతనికి రూ. 2,83,817 విలువైన ఎల్‌ఐసీ , హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ల రెండు బీమా పాలసీలు ఉన్నాయి. కొత్త ముఖ్యమంత్రి పేరు మీద టాటా సఫారీ కారు ఉన్నది. దీని ధర రూ.5 లక్షలుగా అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఇది కాకుండా, టీవీఎస్‌ విక్టర్‌ మోటార్‌ సైకిల్‌ ఉంది, దీని ధర రూ. 35,000.

Spread the love