
ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు దరిపెల్లి రామయ్య, చెట్ల రామయ్య (ట్రీస్ రామయ్య) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏప్రిల్ 12 శనివారం తెల్లవారుజామున వనజీవి రామయ్య (85) గుండెపోటుతో అకాల మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ప్రముఖ చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ, దరిపల్లి రామయ్య 1937 జూలై 1న ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన లాలయ్య, పుల్లమ్మ దంపతులకు జన్మించారు. రామయ్య భారీగా మొక్కలను పెంచడం వల్ల వనజీవి రామయ్య గా, చెట్ల రామయ్యగా, ట్రీస్ రామయ్య గా ప్రసిద్ధి పొందారు. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి పలు అవార్డులు వరించాయి. రామయ్య 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. రామయ్య భార్య పేరు జానకమ్మ. రామయ్యకు నలుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు. ఒక అమ్మాయి. ఐదు దశాబ్దాలకు పైగా సామాజిక అడవుల పెంపకం, నిరంతరం ప్రచారకర్తగా పనిచేశారు. ఖమ్మం జిల్లా మరియు చుట్టూ ప్రక్కల 100 వేల ఎకరాలకు పైగా కోటి మొక్కలు నాటిన వ్యక్తిగా ఘనత పొందారు. మానవ శ్రేయస్సుకు విత్తనమే పరిష్కారమని విశ్వసించిన రామయ్య భౌతికంగా లేరంటే విశ్వసించలేకపోతున్నానని కంకణాల రాజేశ్వర్ వాపోయారు.1995లో సేవా అవార్డు, 2005లో వనమిత్ర అవార్డు, 2015 లో పద్మశ్రీ, యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 2017లో పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం మార్చి 30, 2017 లో జరిగిన రాష్ట్రపతి భవన్ లో పౌర పెట్టుబడి కార్యక్రమంలో రామయ్యకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మశ్రీ అవార్డును ప్రధానం చేశారని అన్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని 9వ తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణలో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కంకణాల రాజేశ్వర్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.