రాముడు హిందువులకే కాదు.. ప్రపంచం మొత్తానికి చెందినవాడు

–  క్షీణిస్తున్న సోదరభావాన్ని పునరుద్ధరించాలి : ఫరూక్‌ అబ్దుల్లా
శ్రీనగర్‌: రాముడు కేవలం హిందువులకే కాదని, ప్రపంచం మొత్తానికి చెందినవాడని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషిచేసిన ప్రజలందరినీ ఆయన అభినందించారు. శనివారం ఏఎన్‌ఐ వార్తా సంస్థతో ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడారు. ‘రాముడు కేవలం హిందువులకు మాత్రమే చెందినవాడు కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆయన చెందినవాడని నేను యావత్‌ జాతికి చెప్పాలనుకుంటున్నా. ప్రపంచంలోని ప్రజలందరికీ ఆయన ప్రభువు. ఇది పుస్తకాలలో రాసి ఉంది’ అని తెలిపారు. ‘ఆయన (రాముడు) సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు. మతం లేదా జాతితో సంబంధం లేకుండా అణగారిన ప్రజలను ఉద్ధరించాలని విశ్వవ్యాప్తంగా సందేశాన్ని ఇచ్చారు. ఈ ఆలయం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో క్షీణిస్తున్న సోదరభావాన్ని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నేను దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. ఆ సోదరభావాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్కరికీ నేను చెబుతున్నా’ అని అన్నారు.

Spread the love