ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి: రామారావు 

నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భాద్యతగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు అన్నారు. గురువారం అవుతాపురం గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం కోసం జూన్‌ 6 నుండి జూన్‌ 19 వరకు నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడం కోసం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు ఊతమిచ్చిన వారమవుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య తో పాటుగా, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, దుస్తులు, భోజనం వంటి అనేక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది అన్నారు.  కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రాము, ఎంఎన్ఓ కళాధర్, ఏపీఎం రమణాచారి, పల్లె వైద్యాధికారి సబితారాణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి, సీఆర్పీ వేముల సంతోష్, వీఓఏలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love