తాను పుట్టి పెరిగిన తండాలో గిరిజనుల శ్రమైక జీవనం, వారి బతుకు వెతలు, సంస్కతీ సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాల సునిశిత పరిశీలన అతడి మనసును తట్టిలేపింది. గిరిజనుల జీవితాలపై అతడి రచనలు అనతి కాలంలోనే పుస్తకాలుగా ప్రచురితమై జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందాయి. పాతికేండ్ల ప్రాయంలోనే ఎవరూ సాధించలేని ఘనతను సాధించిపెట్టాయి. రమేశ్ కార్తీక్ నాయక్ రచనలు ఒక్కోటి ఒక్కో ప్రాధాన్యతతో ప్రజాదరణ పొందాయి. మొదటి కవితా సంపుటికి రమేశ్ 2014లోనే శ్రీకారం చుట్టాడు. తాను చూసిన సంఘటనలు, మనుషులు, సేకరించిన పుస్తకాల్లో ఉన్న అనేక విషయాలను తెలుసుకుని తొలి రచన పూర్తి చేశాడు. గిరిజన బతుకులు, వెతలనే కవితలు, కథలుగా చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో రమేశ్ రాసిన ‘బల్దేర్ బండి’ కవితా సంపుటి 2018లో ప్రచురితం కాగా, 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ భాషా, సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వచన కవితా సంపుటి సాహితీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లోకీ అనువాదమైంది. 2021లో ‘డావ్లో’ పేరుతో తీసుకొచ్చిన కథల సంపుటిలో గోర్ బంజారా కథలను అద్భుతంగా అక్షరీకరించాడు. ఈ సంకలనంలోని ‘పురుడు’ కథ ఆంగ్లంలోకి అనువాదమై ‘ఎక్సేంజెస్’ సాహిత్యానువాద జర్నల్‌లోనూ ప్రచురితమైంది. 2022లో ఆచార్య సూర్యధనుంజయతో కలిసి సహ సంపాదకీయంలో ‘కేసులా’ పేరుతో తొలి గోర్ బంజారా కథలు రాశాడు. 2023లో ‘చక్మక్’ అనే ఇంగ్లిష్ కవితా సంపుటి రచించాడు. తాజాగా ఈ ఆంగ్ల కవితా సంపుటికి ప్రతిష్టాత్మక మ్యూస్ ఇండియా పత్రిక సంస్థ నెలకొల్పిన ‘ది మ్యూస్ ఇండియా యంగ్ రైటర్ అవార్డ’కు ఎంపికైంది. జాతీయ స్థాయిలో ఆంగ్లంలో ప్రచురించిన ఉత్తమ రచనలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందిస్తారు. ఇందులో భాగంగా 2024వ సంవత్సరానికి కవిత్వ విభాగంలో ఈసారి కేంద్రసామిత్య అకాడమీ పురస్కార గ్రహిత రమేశ్ కార్తీక్ నాయక్.. తన తొలి ఆంగ్ల కవిత్వ సంపుటి ‘చక్మక్’ తో అంబికా అనంత్ పొయెట్రీ ప్రైజ్ ను అందుకొనున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి తండాకు చెందిన యువ రచయితకు దర్వాజ తరపున అభినందనలు.