నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిరిసిల్ల నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కోరారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలనీ, గతంలో మాదిరిగానే 50 శాతం సబ్సిడీతో విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. నేత కార్మికులకు రూ.2 వేల కోట్లతో బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వమే నేత కార్మికులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. 10 శాతం సబ్సిడీ ఇచ్చేలా యాన్ సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద రాష్ట్రంలో క్లస్టర్లకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే నేత కార్మికుల కోసం గత ప్రభుత్వం వినియోగించలేదని ఆరోపించారు. చేనేత రంగంలో బీఎల్‌ఐ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 10,638 కోట్లు కేటాయించిందనీ, 67 మంది ఔత్సాహికులకు ఇండిస్టీలు పెట్టుకునేలా రూ. 1536 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఒక్కరోజు ఉద్యోగులు చేనేత దుస్తులు ధరించేలా సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. నేత కార్మికులు తాము తయారుచేసిన బట్టలను స్వయంగా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్ముకునేలా ఈ -కామర్స్ వెబ్ సైట్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనీ, దీనిద్వారా రూ. 150 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని తెలిపారు. వర్కర్ టూ ఓనర్ పథకం ద్వారా ఆదుకుంటామని చెప్పి కేటీఆర్ మోసం చేశారన్నారు. పవర్‌లూమ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.