‘వింతగ బ్రోవులన్ బడుగు పేకలుగా సవరించి నేతరీ!/ సుంతయు ధ్యానమున్విడక సొంపగుకోకిల సృష్టిజేయు నీ/ వింతుల కాంతులు బెనుప నీశ్వరుండంచు నుతింత్రు గాని నీ/ చింతలు దీర్పరెవ్వరు కృశించిన ప్రేవులగానరేలకో’ అంటూ చేనేత నేతల హస్తకళా వైభవ ప్రాభవాల ప్రశంసతో పాటు ఆకలిదప్పుల పట్ల సహానుభూతిని చూపుతూ పద్యం చెప్పిన ఆత్మగల్ల కవయిత్రి, రచయిత్రి, గేయకారిణి, ఉపాధ్యాయిని శ్రీమతి పాలపర్తి హవీలా.
ఖమ్మం గుమ్మం మీద మరో బాలగీతాల జెండా! పద్యాల కలకండ. పాలపర్తి హవీల జూన్ 3, 1985న ఖమ్మంలో పుట్టింది. అమ్మా నాన్నలు పాలపర్తి శ్రీమతి జోసెఫీన్ – శ్రీ విజయ భాస్కర్. పుట్టి పెరిగిన ఖమ్మంలోనే చదువును పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవ చేస్తోంది.
హవీలాను చూస్తే ఒక రకమైన ఆనందం, ఆశ్చర్యం కలగకమానవు. కారణం పద్యవిద్యను పదిలంగా ఒడిసిపట్టుకుంటూనే అటు వచన కవిత్వం, ఇటు బాలగేయ కర్తృత్వం నిర్వహిస్తోంది. తనకు తెలిసిన పద్య విద్యా పరుసవేదిని కావ్యాలుగా అందిస్తోంది. యువతరం పద్యాలు, కావ్యాలు రాయడం విశేషమైతే… హవీల ఆరేండ్లలోనే ఆరు పద్య రచనలు తేవడం అభినందనీయం. నిజానికి హవీల తాను రచయిత్రిగా తొలి రచన ప్రారంభించిన నాటి నుండి నేటి దాకా అంటే ఎడెనమిది యేండ్లలోనే ఎనమిది రచనలుగా అచ్చయ్యింది. ఇందులో పద్యాల ఖండకావ్యాలు, వచన కవితా సంపుటాలు, బాల గేయ సంపుటి ఉండడం విశేషం. పైన ‘తుంటరిగ నవ్వె నెల్లూరి తుంగచాప/… కళలు వేయిగుల్కె దెలుగు నంగళ్లలోన’, ‘అగ్గిపెట్టె నొదుగ నారడుగుల చీర/ చిత్రసరణి సృష్టి చేసినారు’ వంటి పద్యపాదాలు హవీలా తీపి రచనలకు గుర్తు. ‘కవనప్రియ’, ‘పద్య ప్రభాతం’, ‘ఆంధ్ర యశోభూషణం’, ‘ధ్రువకోకిల’ వీరి ఖండ కావ్వాలు. ‘తెలుగుతల్లి’, ‘మాట మన్నించలేర!’ హవీల రాసిన శతకాలు. పద్యాన్ని ఎంతగా ప్రేమిస్తుందో అంతే యిష్టంగా వచన కవిత్వాన్ని రాస్తుది ఈమె. అందుకు ‘అల్లిపూల పల్లవి’, ‘చీకటి మిసిమి’ వంటి కవితా సంపుటాలు చూడొచ్చు. తాను కవియిత్రిగా పద్యాన్ని ప్రారంభించిన నాటి నుండే తెలుగు నేల మీద జాతీయస్థాయి బహుమమతులు, పురస్కారాలను అందుకుంది. గుంటూరు సాహితీ సమాఖ్య ఉగాది పురస్కారాన్ని ఉత్తమ గేయ రచనకు అందుకోగా, మండలి ఫౌండేషన్ వారు తెలుగు బంధువు మండలి వెంకటకృష్ణా రావు జ్ఞాపకంగా ఏర్పాటుచేసిన పద్యకావ్యాల పోటీలో ‘ఆంధ్ర యశోభూషణం’ పద్య కావ్యానికి మొదటి బహుమతి అందుకుంది. ఇంకా సి.పి.బ్రౌన్ అకాడమి-బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్వహించిన పద్య పోటీల్లో బహుమతి అందుకుంది. కొండేపూడి సుబ్బారావు ఉత్తమ కావ్య పురస్కారం ‘ప్రసన్న భారతి’ కావ్యానికి గెలుచుకుంది. భారతి స్మారక ప్రతిభా పురస్కారం, ప్రముఖకవి రావి రంగారావు గారు అందించే జనరంజక కవి ప్రతిభా పురస్కారం వంటివి ఈమె అందుకున్న పురస్కారాల్లో కొన్ని. కావ్యకర్తగానే కాక కార్యకర్తగా కూడా హవీల తనదైన బాధ్యతను నిర్వహిస్తోంది. ‘భావనా ప్రియ’ సాహిత్య బృంద సంస్థను స్వయంగా స్థాపించి సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు, అంతర్జాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పలు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ చేసింది హవీల.
బాల సాహితీవేత్తగా పాలపర్తి హవీల తొలి రచన ‘బాల రసాలసాలం’. పుస్తకం పేరులాగానే గేయాలను కూడా ‘రసాల’వూటగా మలచడం ఈమెకు బాగా పట్టుబడింది. నాకు తెలిసి పద్యవిద్యపై పట్టు, బాలలపై ప్రేమ కారణం కావచ్చు మరి. పిల్లలతో నిరంతరం పనిచేసే పంతులమ్మ కదా, ఆ తన ఆసక్తిని పిల్లల్లో కూడా కలిగించి, ‘పోతన పద్యం మాకిష్టం/ పాత కథలెన్నో మాకిష్టం/ వెమన మాటలు మాకిష్టం/ వామనగుంటలు మాకిష్టం’ అనిపిస్తుంది వారితో. చందమామను గురించి, కలువబామను గురించి మరో గేయంలో వ్రాస్తూ ‘నింగిలోని నవ్వులతో/ తొంగిచూసె చందమామ/ పొంగిపారు చెరువులోన/ పొరలి నవ్వె కలువబామ’.. నిజానికి ఈ రెండు మనకు తెలిపినవే అయినా ఈ గేయంలో ఎంతో అందంగా ఒదిగేలా చేసిందీ కవయిత్రి. పక్షులను, పర్యావరణాన్ని, ప్రకృతిని, ఇంకా తనకు తన బడి ప్రయాణంలో తారసపడిన ప్రతిదానిని, ముఖ్యంగా తన బాల్యంలో తాను చదివిన, విన్నవాటిని కూడా గేయాలుగా మలచింది. అందుకు బాల రసాలసాలంలోని ‘కొం(దొం)గ జపం’ ఒక చక్కని ఉదాహరణ. ఈ గేయపు ఎత్తుగడే ఎంత బాగుందో… ‘చెంగుచెంగు నెగిరిపడెను/ చెరువులోని చేపలన్ని/ రంగురంగు చేపలగని/ చొంగకార్చె కొంగలన్ని’ అనడం చూడండి. అయితే ఇందులోని చేపలు మనం బడిలో చదువుకున్న కథలోని చేపలు కాదుసుమా! ఆటా పాట అంటే ఆనందపడని పిల్లలుండరు కదా, అందులోనూ తాను రోజూ బడిలో, ఇంటిలో చూస్తుందాయె… అందుకే ‘ఆటల… పిట్టలు’ అంటుంది. ‘ఆటల పిట్టల్లారా!!/ ఆటలెన్నో ఆడండి/ పాటల పిట్టల్లారా !! పాటలివే పాడండి’ అని చెబుతుంది. ‘పాటలెన్నో పాడండి’ అనకుండా ‘పాటలివే పాడండి’ అనడం బాగుంది. తాను కవయిత్రిగా తన పిల్లలకు పాటల మూటను అందించింది కదా! ‘రేలారే రేలపూలు’ గేయంలో పల్లెపూల పదనిసనలు, అందాలను వర్ణిస్తుంది. ఇదే జిల్లా నుండి వచ్చిన సమ్మెట ఉమాదేవి కూడా తన వయ్యిని ‘రేలపూలు’గా తెచ్చింది. సింగరేణి తీరవాసులకు ఎండాకాలం గురించి చెప్పాలిసన పనిలేదు ‘ఎండాకాలం’ గేయంలో ప్రత్యక్షంగా చూపిస్తుంది కవయిత్రి. ‘మా అక్కపెళ్లి’ ‘ఎమన్నవి’, ‘కాలాలు’, ‘పిచ్చుకా పిచ్చుకా’ వంటి ఇంకెన్నో చక్కని, చిక్కని గేయాలు ఈ సంపుటిలో ఉన్నాయి. ‘చీకటులన్నీ ఎక్కడ దాక్కొనె అమ్మాయి?/ వేకువ తరిమేసింది వెదుకకు అబ్బాయి/ చుక్కలు ఎటువెళ్ళాయో చూడే అమ్మాయి/ దిక్కుల్లో కరిగాయి తెలియర! అబ్బాయి’ అనడం విజ్ఞానాన్ని ఇంత సుళువుగా కూడా చెప్పొచ్చా అనిపిస్తుంది. బాలల కోసం గేయతాయిలాన్ని, పద్యాల వాయినాన్ని అందించిన ఖమ్మం బాలగేయ రసాలసాలం పాలపర్తి హవీలకు అభినందనలు. భళా! హవీలా!! జయహౌ బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548