నిధుల పెండింగ్‌తో కష్టతరమవుతున్న నిర్వహణ
దాతలు ఇస్తేనే కొత్త బుక్కులు కొనుగోలు చేసేది
సిబ్బందికి మూడు నెలలుగా నిలిచిన వేతనాలు
నియామకాలు లేక ఉన్న వారిపై పనిభారం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రంథాలయాలు.. జ్ఞాన సమూపార్జనకు నిలయాలు. సమాజాన్ని చైతన్యవంతం చేసే ‘ఆలయాలు’. అంతటి ప్రాధాన్యత ఉన్న గ్రంథాలయాలు నిధుల సమస్యలతో సతమతమవుతున్నాయి. వాటికి రావాల్సిన కాంటిజెన్స్ నిధులు విడుదల కాకపోవడంతో నిర్వహణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త పుస్తకాలు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి కొనుగోలు చేసి ఇస్తేనే కొత్త పుస్తకాలు వస్తున్నాయి తప్పా.. పాఠకుల అవసరాలకు తగ్గట్టు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆఖరికి రోజువారి వార్తా పత్రికలకు సైతం బిల్లులు చెల్లించలేక.. సదరు ఏజెన్సీలను బతిమిలాడుతూ పేపర్లు వేయిస్తున్నారు. దీనికి తోడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, పార్ట్ టైం వర్కర్లకు, హెల్పర్లకు మూడు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు రానుండగా అందరితో కలిసి వేడుకలు నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఏండ్ల నుంచి పని చేస్తున్నా అరకొర వేతనమే ఉన్నా.. అవి కూడా సకాలంలో రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు 24 శాఖలు ఉన్నాయి. కామారెడ్డిలో జిల్లా కేంద్రంతో పాటు 18 శాఖలు ఉన్నాయి. ఇరు జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రధాన బ్రాంచ్‌లకు రెగ్యూలర్‌గా 220 నుంచి 250 మంది పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న శాఖల నిర్వహణకు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు కలిపి నెలకు సుమారు రూ.8 నుంచి 9 లక్షలు, కామారెడ్డిలో సుమారు రూ.5 లక్షల వరకు ప్రతినెలా కాంటింజెన్స్ నిధులు విడుదల చేయాల్సి ఉన్నా పెండింగ్‌లో పెడుతున్నారు. ఫలితంగా పేపర్ బిల్లులతో పాటు కరెంట్, వాటర్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాలు పెండింగ్ పడుతున్నాయి. ప్రస్తుతం హెల్పర్‌కు రూ.14 వేలు, రికార్డు అసిస్టెంట్‌కు రూ.16,500, పార్ట్ టైం వర్కర్‌కు రూ.16 వేలు, గ్రంథపాలకులకు నెలకు రూ.19000 వేతనం ఉంది. ఔట్ సోర్సింగ్ కింద ఏండ్లుగా పని చేస్తున్నా వేతనాలు పెరగకపోగా.. అవి కూడా సక్రమంగా రాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే బిల్లులు మంజూరు చేసి తమకు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపాలని సిబ్బంది కోరుతున్నారు.
1988 నాటివే.. కొత్త నియామకాల్లేవ్
గ్రంథాలయాల్లో కొత్త నియామకాలు లేక ఉన్న వారిపైనే అదనపు పని భారం పడుతుంది. 1988లో చేపట్టిన నియామకాలు తప్పా.. మళ్లీ చేపట్టిన దాఖలాలు లేవు. మధ్యలో కారుణ్య నియామకాలు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశారే తప్పా.. పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టకపోవడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో మొత్తం 53 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 11 మంది రెగ్యూలర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరో 20 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. కామారెడ్డి 31 పోస్టులు మంజూరు ఉండగా.. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే రెగ్యూలర్ సిబ్బంది ఉండగా.. మరో 12 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. నియామకాలు లేకపోవడంతో ఉన్న వారికే అదనపు శాఖలకు ఇన్‌చార్జీగా కేటాయిస్తుండటంతో తీవ్ర పనిభారంతో సతమతమవుతున్నారు. 8 గంటల పాటు గ్రంథాలయాలు తెరవాల్సి ఉండగా.. కామారెడ్డిలో ఉద్యోగ అభ్యర్థుల అవసరాల రీత్యా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది.
సెస్సూ పెండింగే..
గ్రంథాలయాలకు ‘సెస్’ ప్రధాన ఆదాయ వనరు. ట్యాక్స్ ల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయి మీద గ్రంథాలయానికి 8 పైసలు జీపీలతో పాటు మున్సిపాలిటీలు అందజేయాల్సి ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో సుమారు రూ.2.27 కోట్ల సెస్ రావాల్సి ఉండగా.. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఇటీవల రూ.98 లక్షలు వసూలు కాగా.. వాటి చెక్ క్లియరెన్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
కొత్త పుస్తకాలు అందుబాటులో ఉంచాలి : సమత. పీజీ, బీఎడ్. కామారెడ్డి
గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు కొన్ని నెలలుగా గ్రంథాలయానికి వస్తున్నా. ఇక్కడ వసతులు బాగున్నాయి. కానీ తీవ్ర పోటీ ఉంటుంది. ముందు వచ్చిన వారికే చైర్లు ఉంటున్నాయి. ఇంకా కొన్ని కుర్చీలు వేయించాలి. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఇంకా కొత్త పుస్తకాలు అందుబాటులో ఉంటే బాగుంటుంది. దాతల సహకారంతో ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు.







కామెంట్లు (0)