విద్యావాలంటీర్లను నియమించాలి

– ఎస్జీటీలను రిలీవ్‌ చేయాలి
– పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలి : టీపీటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం ఇచ్చిన హామీ మేరకు విద్యావాలంటీర్లను నియమించి బదిలీ అయిన ఎస్జీటీలను వెంటనే రిలీవ్‌ చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని కోరారు. మ్యూచువల్‌ టీచర్లకు బదిలీలు చేపట్టాలని విన్నవించారు. ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలనీ, నాలుగు డీఏలను విడుదల చేసి పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. మిగిలిన ఖాళీల్లో అర్హతల గల ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలన్నారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి మాట్లాడుతూ.. జీవో 317తో ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. నైట్‌ వాచ్‌మెన్లను, బడి గంట కొట్టడానికి నాలుగో తరగతి ఉద్యోగులను వెంటనే నియమించాలని విన్నవించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నెబోయిన తిరుపతి, డి.శ్రీనివాస్‌ కార్యదర్శులు ఎ.భుజంగరావు, కె.భోగేశ్వర్‌, ఎం. రాములు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love