సాధారణ బదిలీలు పారదర్శకంగా జరపాలి

– తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరా4బాద్‌
సాధారణ బదిలీలు పారదర్శంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రిని ఆ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పెరిఫెరల్‌ మెడికల్‌ కాలేజీలో ఇప్పటికే ఐదేండ్లు మించిన వారికి బదిలీల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు ఏడేండ్ల తర్వాత జరుగుతున్నాయని వారు గుర్తుచేశారు. అందుచేత ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బదిలీల్లో హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా ఉన్న వారికి విముక్తి కల్పించి బయట వారికి అవకాశం కల్పించాలనీ, అదే సమయంలో బదిలీల్లో హైదరాబాద్‌ పోస్టింగ్‌ కోసం పైరవీలు అంగీకరించకూడదని కోరారు. అన్ని రకాల పదోన్నతుల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించాలని వారు మంత్రికి విన్నవించారు. హార్డ్‌షిప్‌ అలవెన్స్‌ ట్రైబల్‌, రూరల్‌ ప్రాంతాలన్నింటికీ వర్తింపజేస్తూ గిరిజన ప్రాంతాలకు 50 శాతం, మిగిలిన కాలేజీలకు కనీసం 30 శాతం ఉండేలా చూడాలన్నారు.
వారి వినతులకు మంత్రి దామోదర సానుకూలంగా స్పందించారు. గతంలో బదిలీల పాలసీతో నష్టాలు జరిగాయని గుర్తు చేశారు. అలా కాకుండా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ బొల్లేపాక, ప్రదాన కార్యదర్శి డాక్టర్‌ కిరణ్‌ మాదాల, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ ప్రకాష్‌, కోశాధికారి డాక్టర్‌ రమేష్‌, జోనల్‌ కార్యదర్శులు డాక్టర్‌ మంద బాబు, డాక్టర్‌ గిరిదర్‌ నాయక్‌, డాక్టర్‌ పాల్గున్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love