రహదారి భద్రత – వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశంపై ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గురువారం రోజున వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి నేతృత్వంలో ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష, కార్యదర్శులు పెందోట అనిల్ కుమార్, సందు ప్రవీణ్, ఉపాధ్యక్షులు వి. యన్. వర్మ, రాజుల రామనాధం, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్ లు ఇందల్ వాయి టోల్ ప్లాజా ను సందర్శించడం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ప్రతీ వాహన వినియోగదారుల నుండి తప్పనిసరి గా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్న నిర్వాహకులు, నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా వద్ద ట్రామా సెంటర్ లేక పోవడం గుర్తించడం జరిగింది. వాహన వినియోగదారులకు ప్రమాదం జరిగిన వెంటనే ఒక గంట లోపు చికిత్స అందించాల్సిన గోల్డెన్ అవర్ లో ట్రామా సెంటర్ కు వెళ్లలేని పరిస్థితులను గమనించడం జరిగింది. ఇందల్ వాయి కి 27 కి.మీ. ఉన్న నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రామా సెంటర్ లేకపోవడం, మరొక వైపు డిచ్ పెల్లి ప్రభుత్వ హాస్పిటల్, కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్స్ లలో ట్రామా సెంటర్ లు లేక పోవడంతో ప్రమాదాలు జరిగిన వాహన వినియోగదారులు గోల్డెన్ అవర్ లో చికిత్స అందలేక ప్రాణాలు కోల్పోతున్నారని వినియోగదారుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వినియోగదారుల ప్రతినిధులు నిజామాబాద్ లోని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ లతో కలిసి రహదారి భద్రత – వినియోగదారుల చైతన్యం సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు.