Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఈ శుక్రవారమే హార్మూజ్ జలసంధికి విడుదల.. ట్రంప్ క్లారిటీ

ఈ శుక్రవారమే హార్మూజ్ జలసంధికి విడుదల.. ట్రంప్ క్లారిటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరాన్‌తో కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ శాంతికి, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కీలకమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం అంతర్జాతీయంగా సానుకూల వాతావరణానికి బాటలు వేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మాట్లాడుతూ “ఇరాన్‌తో కుదిరిన ఈ ఒప్పందం చాలా కీలకమైనది. ఇది ఇరాన్ అణు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది” అని అన్నారు. ఈ ఒప్పందం విజయవంతం కావడానికి ఫ్రాన్స్ తన పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే కీలకమైన చమురు రవాణా మార్గం ‘హర్మూజ్ జలసంధి’ ఇప్పటికే పాక్షికంగా తెరుచుకుందని, ఈ శుక్రవారం (జూన్ 19) నాటికి పూర్తిస్థాయిలో నౌకల రాకపోకలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా కఠినమైన నిబంధనలతో ఈ ఒప్పందం కుదిరిందని, దీనికి టెహ్రాన్ కొత్త నాయకత్వం అంగీకరించిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని, అదే సమయంలో స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఒప్పందానికి సంబంధించిన అధికారిక పత్రాలను శుక్రవారం తర్వాత బహిర్గతం చేస్తామని చెప్పారు. ఈ ఒప్పందంపై అధికారిక సంతకాల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ వెళ్తారని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -