కాకతీయ కళాతోరణం తొలగింపు అవమానకరం

– కేయూ గేటు ముందు ఆందోళన
– సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నం
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
రాష్ట్ర రాజముద్రలో కాకతీయ తోరణాన్ని తొలగించడం తెలంగాణ ప్రజలను అవమానించడ మేనని బీఆర్‌ఎస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం కాకతీయ యూనివర్శిటీ మొదటి గేట్‌ ముందు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. ఈ ప్రాంత శిల్పకళా వైభవానికి, సంప్రదాయాలకు ప్రజారంజక పాలనకు నిలువెత్తు నిదర్శనం కాకతీయ కళాతోరణం అని, దానిని తొలగిస్తే సహించేది లేదని అన్నారు. కాకతీయ కళాతోరణానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, చరిత్ర తెలియకుండా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడితే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. కేసీఆర్‌పై ఉన్న ద్వేషంతో కాకతీయ తోరణం జోలికి వస్తే, తెలంగాణ మలిదశ ఉద్యమం తరహాలో యూనివర్సిటీ వేదికగా మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వరంగల్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవడం సరైన విధానం కాదని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సంగని సూర్య కిరణ్‌, అర్బన్‌, రూరల్‌ కో-ఆర్డినేటర్స్‌ గండ్రకోట రాకేష్‌ యాదవ్‌, పిల్లల నాగరాజ్‌, కలకోట్ల సుమన్‌, గొల్లపల్లి వీరస్వామి, అర్షం మధు, పస్తం అనిల్‌, కళ్యాణ్‌, చిర్రా ప్రకాష్‌, రాకేష్‌, సేహిత్‌, ముజయితిన్‌ పాల్గొన్నారు.

Spread the love