హైదరాబాద్ : భారత్‌లో తమ వ్యాపార వ్యూహాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లే అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రెనో వచ్చే 3-5 ఏండ్లలో కొత్త ఆవిష్కరణలకు ప్లాన్ చేస్తుందన్నారు. ఫ్రెంచ్ కార్ల తమ కంపెనీ ప్రస్తుత ఏడాదిలోనూ కొత్తవేరియంట్‌లతో పోర్టు పోలియోను మెరుగుపర్చుకుంటుందని తెలిపారు. రెనో కోసం యూరప్ వెలుపల ఉన్న నాలుగు ప్రధాన కేంద్రాలలో భారతదేశం ఒకటన్నారు.ఈ క్రమంలోనే ఉత్పత్తి పోర్టు పోలియోను విస్తరిస్తోందన్నారు. వచ్చే మూడేళ్లలో ఐదు ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నామన్నారు. కొత్త 2024 శ్రేణితో కైజర్, ట్రైబర్, క్విడ్ మోడల్‌లను బలోపేతం చేయనున్నామన్నారు. వినియోగదారులను పెంచుకునేందుకు 3 మోడళ్లలో 5 కొత్త వేరియంట్‌లను పరిచయం చేస్తున్నామన్నారు. రెనాల్యూషన్ ఇండియా 2024 కింద కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరిస్తున్నామన్నారు.