పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని ఎంపీకి వినతి

నవతెలంగాణ-ఆమనగల్‌
పెండింగ్‌లో ఉన్న పాలబిల్లులు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విజయ డెయిరీ పాల ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాల ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు మాట్లాడుతూ ఏప్రిల్‌ నెల 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు రెండు నెలలకు సంబంధించి 15 రోజులకు ఒక బిల్లు చొప్పున మొత్తం నాలుగు బిల్లుల డబ్బులు పాడి రైతులకు రావాల్సి ఉందని వారు వాపోయారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో పాడి పరిశ్రమనే నమ్ముకుని జీవిస్తున్న పాడి రైతుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో పెండింగ్‌ బిల్లులు అందించేందుకు కృషి చేస్తానని ఎంపీ మల్లు హామీనిచ్చినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ విజయ డయిరీ జనరల్‌ మేనేజర్‌ మల్లయ్యకు వినతిపత్రం అందజేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ పాల ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు సబావత్‌ బిచ్యా నాయక్‌, చేగూరి వెంకటేష్‌, రవీందర్‌ రెడ్డి, రంగయ్య, శ్రీకాంత్‌ రెడ్డి, నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love