– రాష్ట్రపతి, ప్రధానికి క్రైస్తవ నేతల వినతి
– దాడులు పెరగడంపై ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో క్రైస్తవులపై పెరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని 400 మందికి పైగా క్రైస్తవ నేతలు, 30 చర్చి గ్రూపులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాయి. క్రిస్మస్ సీజన్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశమైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని హింస, బెదిరింపులు, అడ్డంకులు సృష్టించడం వంటి 14 ఘటనలు చోటుచేసుకోవడాన్ని వారు ప్రస్తావించారు. ఈ మేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. దానిపై థామస్ అబ్రహం, డేవిడ్ ఒనెసిము, జొవాబ్ లొహారా, రిచర్డ్ హోవెల్, మేరీ సారియా, సెడ్రిక్ ప్రకాష్ ఎస్జే, జాన్ దయాల్, ప్రకాష్ లూయిస్ ఎస్జే, జెల్హో కేహో, ఈహెచ్ ఖర్కాంగర్, అలెన్ బ్రూక్స్, కె.లొసి మావో, అఖిలేష్ ఎడ్గర్, మైకెల్ విలియమ్స్, ఏసీ మైకెల్, విజయేష్ లాల్ వంటి ప్రముఖ క్రైస్తవ నేతలు సంతకాలు చేశారు. దేశంలో క్రైస్తవుల పట్ల అసహనం, శతృత్వం పెరుగుతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని 720 ఘటనలు జరిగాయంటూ ఎవెంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందిందని, గత సంవత్సరం జనవరి-నవంబర్ మధ్య నమోదైన 760 కేసులను యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం నమోదు చేసిందని వారు వివరించారు. మత మార్పిడుల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, మత స్వేచ్ఛకు ముప్పు పెరుగుతోందని, విద్వేష ప్రసంగాలు ఎక్కువయ్యాయని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని వారు ప్రధానిని కోరారు. మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడుల విషయంలో వేగవంతమైన, నిస్పాక్షిక విచారణ జరిపించాలని క్రైస్తవ నేతలు రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ పరమైన హక్కులను పరిరక్షించేలా రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అన్ని మతాల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, తమకు ఇష్టమైన మత సంప్రదాయాన్ని ఆచరించేందుకు ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. భారత నైతిక చట్రానికి, ఆర్థిక సౌభాగ్యానికి, సామాజిక ఐకమత్యానికి సామరస్యమే కీలకమని వారు ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.