మళ్లీ చెలరేగిన హింస..

మళ్లీ చెలరేగిన హింస..–  మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణ.. 13 మంది మృతి
న్యూఢిల్లీ: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్‌నౌపాల్‌ జిల్లా సైబాల్‌ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగల వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. తుపాకులతో కాల్చుకున్నారు. ఈ ఘర్షణల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న భద్రతాధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. కాగా అప్పటికే అక్కడ 13 మృతదేహాలు పడి వున్నాయని భద్రతాధికారులు తెలిపారు. అయితే, ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారు లీతూ గ్రామానికి చెందిన వారు కాదని అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఈ గ్రూప్‌.. గ్రామంలోని మరో తెగకు చెందిన గ్రూప్‌తో ఘర్షణకు దిగిందని భద్రతాధికారులు చెప్తున్నారు. స్థానికులు కాకపోవడంతో మరణించిన 13 మంది ఎవరనేది ఇంకా గుర్తించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
కాగా, ఈ ఏడాది మే 3న మణిపూర్‌లోని మైతీ, కూకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలు కొన్ని నెలలపాటు కొనసాగాయి. ఈ హింసాత్మక ఘటనల్లో మొత్తం 182 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 వేల మంది నివాసాలను కోల్పోయారు. ఈ ఘర్షణల కట్టడి కోసం ఆ రాష్ట్రంలో భారీగా బలగాలను మోహరించారు. ఇంటర్నెట్‌ సేవలపై కూడా నిషేధం విధించారు. ఇటీవలే పరిస్థితి అదుపులోకి రావడంతో ఆదివారమే ఇంటర్నెట్‌ సేవలను తిరిగి పునరుద్ధరించారు. ఇంతలోనే మళ్లీ తెగల నడుమ ఘర్షణలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

Spread the love