మల్లేపల్లి ఐటీఐలో ట్రైనింగ్ సెంటర్లకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన

నవతెలంగాణ-హైదరాబాద్ : సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు దూసుకెళ్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల(ఏటీసీ)కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలకు సరితూగేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రయివేటు రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపు మాత్రమే చూడరని పేర్కొన్నారు. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్ ఉంటే ప్రయోజనం లేదన్నారు. కాగా, ఐటీఐలను ఆధునీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు రూ.2,324 కోట్ల నిధులను కేటాయించింది. వీటితో ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయనున్నారు. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది.

Spread the love