మూనాళ్ళ ముచ్చటగా మిగిలిన చెత్త సేకరణ రిక్షాలు..

– వినియోగంలోకి లేక శిధిలావస్థకు  చేరిన వైనం

నవతెలంగాణ – బొమ్మలరామారం 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల వారీగా చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు.ఈ మేరకు చెత్త సేకరణ రిక్షాల వినియోగం మూనుళ్ల ముచ్చుటగా మిగిలింది. ప్రతి గ్రామపంచాయతీ సిబ్బందితో ఇంటింటికి చెత్తను సేకరించి రిక్షాల ద్వారా చెత్తను చేరవేసే నేపథ్యంలో ఈ రిక్షాలను వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.పంపిణీ చేసిన సమయంలో వీటి వినియోగం కొంత మేరకు బాగానే అనిపించింది. కానీ నేడు మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో అవి వినియోగంలో లేక శిధిలావస్థలో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్యంలో భాగంగా ట్రాక్టర్ ను పంపిణీ చేసింది.దీనికి ప్రత్యక్షంగా పంచాయతీ సిబ్బంది కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రిక్షాలు వినియోగంలో లేక శిధిల వ్యవస్థకు చేరాయి. కనీసం గ్రామపంచాయతీ చిన్న చిన్న అవసరాలకు కూడా వీటిని వినియోగించుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది.ఏళ్ళ గడుస్తున్న రిక్షాల పరిస్థితి శిథిలంగానే మారిందే తప్ప వీటి వినియోగం మాత్రం శూన్యంగా ఉంది. ఎంతో అర్భాటంగా పంపిణీ చేసిన రిక్షాలు ఇలా నిరుపయోగంగా మారడం ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచయడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలవ్యవస్థలో ఉన్న రిక్షాలను తిరిగి వినియోగంలోకి తెచ్చి ప్రతి గ్రామపంచాయతీ పనులకు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Spread the love