– పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలిలో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఎస్ హెచ్ ఓ ఎస్ ఐ యయాతి రాజు సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, కోలా లక్ష్మీనారాయణ, చిన్నంశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్ మిండ హరికృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



