- డిపోల వద్ద భారీ బందోబస్తు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ పరిరక్షణ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. కార్మికుల సమ్మెకు వెళ్లడంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. అరకొర నడుస్తున్న ప్రైవేటు బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డిపోల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా సమ్మె ప్రభావంతో బుధవారం అర్థరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర రాజధానికి ఇబ్రహీంపట్నం సమీపంలోనే ఉండడంతో రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్, ఉప్పల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, కోటి, ఉమెన్స్ కాలేజ్, మెహిదీపట్నం, గ్రామీణ ప్రాంతాలలో దేవరకొండ, మాల్, చౌటుప్పల్, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు విరివిరిగా నడుస్తాయి. సమ్మె కారణంగా ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి..
కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా, ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ప్రజా రవాణా స్తంభించకుండా అద్దె బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అన్ని జిల్లాల నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీఏ అధికారులను రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు తగిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రైవేటు బస్సులను రోడ్డుపైకి తెస్తున్నారు. అయితే ప్రయాణికుల అవసరాల తగ్గట్టు 100 బస్సులు నడపాల్సిన తరుణంలో ఒక్క బస్సు నడిపితే ఏ విధంగా రవాణాకు ఉపయోగపడుతుందనేది ప్రశ్నార్థకమే.
ఇబ్రహీంపట్నంలో ప్రయివేటు డ్రైవర్ల మద్దతు
ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు బస్సు డ్రైవర్ సైతం మద్దతు ప్రకటించారు. తోటి కార్మికుల సమ్మెలో ఉంటే తాము ఎలా బస్సులు నడిపిస్తామని తెలిపారు. కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరంలోకి వచ్చి తమ మద్దతులను పట్టిస్తున్నట్లు తెలిపారు.




