నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సులు డిపోకే పరిమితమైయ్యాయి.దీంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోల్లో 10 వేల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. సంస్థలో 39 వేల మంది కార్మికు లు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బస్సులు రోజుకు 36 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా బస్సులన్ని డిపోలకే పరిమితమైయ్యాయి. ఆయా డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు అమలు చేసేవరకు సమ్మె విరమించమని కార్మికులు భీష్మించారు. దీంతో ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
మంగళవారం రాత్రి ప్రభుత్వ కమిటీతో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. సమస్యల పరిష్కారానికి అధికారులు 4 వారాల సమయం కోరగా, దీనిని జేఏసీ ఖరాఖండిగా తిరస్కరించింది. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, గత్యంతరం లేకే సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు.



