Wednesday, April 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప‌శ్చిమాసియా యుద్ధం..సీజ్ ఫైర్ పొడిగింపు

ప‌శ్చిమాసియా యుద్ధం..సీజ్ ఫైర్ పొడిగింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతున్న నేపథ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం “తీవ్రంగా చీలిపోయినట్లు” కనిపిస్తోందని, స్పష్టమైన వైఖరిని తెలియజేయడానికి దానికి సమయం అవసరమని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వానికి చర్చల కోసం ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు రావడానికి మరింత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాసుకొచ్చారు.

కాగా, ఇరాన్‌, అమెరికా మధ్య పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రశ్నే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. అమెరికా డిమాండ్ల చిట్టా పెరిగిపోతోందని, అవాస్తవ అంచనాలు వేస్తోందని, వైఖరిని తరచూ మార్చుకుంటోందని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందని మండిపడింది. హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధించడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది.

మ‌రోవైపు రెండో ద‌ఫా చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌ చేరుకున్నప్పటికీ ఇరాన్‌ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఇప్పటి వరకూ ఏ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌ బయలుదేరలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలియజేసింది. రెండో విడత చర్చల కోసం ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌ చేరుకున్నదని లేదా బయలుదేరిందని పలు అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తాసంస్థలు కథనాలు అంది స్తుండడంతో ఇరాన్‌ ఈ వివరణ ఇచ్చింది. ఒత్తిడితో చర్చలు జరపలేమని ఇరాన్‌ అధికా రులు స్పష్టం చేశారు. అమెరికా వైఖరిలో వచ్చే మార్పును బట్టే చర్చలు కొనసాగుతా యని తేల్చిచెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -