ఆర్టీఐ యాక్ట్ ను పాఠ్యాంశం లో చేర్చాలి

– కొడారి వెంకటేష్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ –  భువనగిరి
అవినీతి రహిత సమాజం కోసం, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం -2005 ను పాఠ్యాంశం లో చేర్చి,  విద్యార్థులకు భోదించాలని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలో సమాచార హక్కు చట్టం -2005 పై జరిగిన రెండు రోజుల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 4,8,10 వ తరగతుల్లో సమాచార హక్కు చట్టం-2005 పాఠ్యాంశం గా ఉండేదని, గత ప్రభుత్వం అట్టి పాఠ్యాంశాలను తొలగించి, రాష్ట్ర కమిషనర్ల ను పూర్తిస్థాయిలో నియమించక చట్టాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ఇటీవల నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ను పాఠ్యాంశం లో చేర్చాలని, జోనల్ వారిగా సమాచార కమిషనర్ల ను నియమించాలని ఆయన కోరారు. విద్యార్థి దశ నుండే చట్టంపై అవగాహన ఉంటే, భవిష్యత్తులో అవినీతి రహిత, ఉత్తమ సమాజం ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు.  తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్టీఐ ఆక్టివిస్ట్ కావడంతో సమాచార హక్కు చట్టం క్షేత్ర స్థాయిలో ప్రచారం జరుగుతోందని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరి 19,20 తేదీలలో ప్రభుత్వ అధికారులకు, సివిల్ సొసైటీ ఆర్గనైజర్ లకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సమాచార హక్కు చట్టం -2005  పై శిక్షణా తరగతులను నిర్వహించి, చట్టం పై మరింత విజ్ఞానాన్ని అందించి, సర్టిఫికెట్లు అందజేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ. ఎస్. రామచంద్ర, సీనియర్ ఫ్యాకల్టీలు  శ్రీనివాస్ మాధవ్, కే. సౌమ్యా రాణి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love