– అధికారుల బదిలీల పాలసీపైరాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ఆదేశించింది. ఈ మేరకు ఈసీఐ జాయింట్ డైరెక్టర్ అనుజ్ చందక్ శనివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పక్క జిల్లాల్లో అధికారులను బదిలీ, పోస్టింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. కేవలం రెండు పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మినహా…
అన్ని రాష్ట్రాలు బదిలీ చేయబడిన అధికారులు అదే నియోజక వర్గంలో పోస్టింగ్ పొందకుండ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బదిలీ విధానాన్ని స్ఫూర్తితో అమలు చేయాలని మభ్య పెట్టే దిశలో ఉండకూడదని పునరుద్ఘాటించింది. ఇప్పటికే చేపట్టిన బదిలీల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం… వారి సొంత జిల్లాలో పోస్టింగ్ పొందిన లేదా ఒక స్థలంలో మూడేండ్లు పూర్తి చేసిన అధికారులందరినీ వెంటనే బదిలీ చేయాలని వెల్లడించింది.