మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి: ఎస్. రమా

నవతెలంగాణ – సూర్యాపేట
మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రమా డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పెంచిన రూ.3000 ఇంత వరకు కార్మికులకు గౌరవ వేతనంగా ప్రకటించి ఇప్పటివరకు కొన్ని మండలాలలో ఇవ్వని  పరిస్థితి నెలకొందన్నారు. అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కానీ పెండింగ్ బిల్లులు నేటికి చెల్లించక పోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు  పాఠశాలల్లో పిల్లలకు ఏం పెట్టి వండి పెడతారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆహారలేమితో బాధపడుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం బాగా తోడ్పడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయని డ్రాప్ అవుట్ పాఠశాలలో చదువుకునే వారి సంఖ్య పెంచడానికి సామాజిక సమానత్వం కాపాడడానికి ఈ స్కీం బాగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ స్కీం లను బలోపేతం చేయడానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పని చేసే వారిలో 98 శాతం మంది మహిళలు సామాజికంగా వెనుకబడిన ,అట్టడుగు వర్గాలకు చెందిన వారే ఉన్నారని వీరికి ఎలాంటి సాంఘిక భద్రత లేదని తెలిపారు. ఇచ్చే గౌరవ వేతనం పది నెలలకు మాత్రమేనని వంటకు కావలసిన మౌలిక వసతులు కల్పించకుండా పథకం నీరుగారిచే విధంగా చేస్తున్నారని ఆమె విమర్శించారు.
గుడ్లకు అదనపు బడ్జెట్ ఇవ్వాలని పేర్కొన్నారు. కాటన్ బట్టలు యూనిఫామ్ ఇవ్వాలన్నారు. భీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైన గ్యాస్ ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టలు కొట్టే పని ప్రభుత్వాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26000 పెంచాలని ఆమె అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకు ఏకలక్ష్మీ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ అప్పులు తెచ్చి పిల్లలకు వండి పెట్టాలని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. పెంచిన రూ.10000 వేతనాన్ని   వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే మధ్యాహ్న భోజన కార్మికులను నెల నెల బిల్లులు ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా నెల నెల వేతనాలు ఇవ్వాలని  కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కే వరలక్ష్మి, సంకోజు గీత, తిరుపతమ్మ, జిల్లా నాయకులు ఉప్పమ్మ, దాసు రుద్రమ్మ ,మంగమ్మ ,సరస్వతి, పిట్టల నాగమణి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Spread the love