– 23న బడులకు చివరి పనిదినం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-2) పరీక్షలు జరగనున్నాయి. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ఈనెల ఎనిమిది నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ మార్పు చేసిన విషయం తెలిసిందే. అన్ని తరగతుల విద్యార్థులకూ ఉదయం పూట పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి 11.45 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ పరీక్ష ఈనెల 20న ఉదయం తొమ్మిది నుంచి 11.45 గంటల వరకు, బయలాజికల్ సైన్స్ పరీక్ష అదేరోజు మధ్యాహ్నం 12.30 నుంచి 3.15 గంటల వరకు ఉంటుంది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ పరీక్ష ఈనెల 20న ఉదయం తొమ్మిది నుంచి 10.30 గంటల వరకు, బయలాజికల్ సైన్స్ పరీక్ష ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తారు. జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 23న ఫలితాలను ప్రకటిస్తారు. అదేరోజు తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి మార్కుల రికార్డులపై వారి సంతకాలను తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలకు ఈనెల 23న చివరి పనిదినం. 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుంటాయి.